YS Jagan Kadapa Tour: బద్వేల్ లో సెంచురీ పరిశ్రమ ప్రారంభించిన సీఎం జగన్- 2,266 మందికి ఉపాధి, వేల రైతులకు లబ్ధి
YS Jagan Kadapa Tour: బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరంలో రూ.1,000 కోట్లతో నిర్మించిన సెంచురీ ప్యానల్స్ పరిశ్రమను జగన్ ప్రారంభించారు.
YS Jagan Inaugurates Century Industry: కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల కడప పర్యటన (YS Jagan Kadapa Tour)లో బిజీగా ఉన్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్ కడపకు చేరుకున్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరంలో రూ.1,000 కోట్లతో నిర్మించిన సెంచురీ ప్యానల్స్ పరిశ్రమ (Century Ply Manufacturing Plant)ను జగన్ ప్రారంభించారు. సెంచురీ పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్ ప్లాంట్లను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. అనంతరం సంస్థ చైర్మన్, సిబ్బందితో కాసేపు మాట్లాడారు.
సెంచురీ పరిశ్రమ ద్వారా 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధితో పాటు 25 వేల రైతు కుటుంబాలకి లబ్ధి కలగనుంది. 80 వేల ఎకరాల్లో జామాయిల్ చెట్ల పెంపకానికి ప్రోత్సాహకం ఉంటుంది. ఇప్పటికే సబ్సిడీ ధరకు 50 లక్షల విత్తన మొక్కల పంపిణీ జరుగుతోంది. ఈ యూనిట్ కు అనుబంధంగా నాయుడుపేటలో రీసిన్ తయారీ యూనిట్ ఏర్పాటు అవుతోంది.
వైయస్ఆర్ జిల్లా గోపవరం సమీపంలో రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన సెంచురీ ప్లై ప్యానల్స్ ఇండస్ట్రీని ప్రారంభించిన సీఎం @ysjagan. అనంతరం అక్కడి ప్లాంట్‌లోని వివిధ విభాగాలను సిబ్బందితో కలిసి పరిశీలించిన సీఎం వైయస్ జగన్. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.… pic.twitter.com/qeEZjwZqOv
— YSR Congress Party (@YSRCParty) December 23, 2023
కడప జిల్లాలో బిజీబిజీగా సీఎం జగన్..
వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ కడపలోని రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైయస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ.125 కోట్ల వ్యయంతో 452 పడకలతో నిర్మించారు. అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌ను ప్రారంభించారు. అదే రిమ్స్ ప్రాంగణంలో క్యాన్సర్ కేర్ బ్లాక్‌ను, అనంతరం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సీఎం జగన్ ప్రారంభించారు.
అక్కడి నుంచి వెళ్లి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభించారు. అనంతరం ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ లను సీఎం జగన్ ప్రారంభించారు. వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి.. అక్కడినుంచి ఇడుపులపాయ చేరుకుని శనివారం రాత్రికి వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్ బసచేస్తారు.
డిసెంబర్ 24న జగన్ షెడ్యూల్..
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు డిసెంబర్ 24న సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అటు నుంచి సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆదివారం రాత్రికి స్థానిక గెస్ట్‌హౌస్‌లో జగన్ బస చేస్తారు.
డిసెంబర్ 25న ఉదయం ఇడుపులపాయ నుంచి పులివెందులకు వెళ్తారు. అక్కడ సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొని మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానాకి చేరుకుంటారు.