Janasena: గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం- వారాహి విజయయాత్ర కమిటీలతో భేటీలో పవన్ కళ్యాణ్
Janasena Chief Pawan Kalyan: జులై తొమ్మిదో తేదీ సాయంత్రం ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.
Janasena Chief Pawan Kalyan: రేపటి నుంచి వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి 12వ తేదీ వరకు రెండో విడత షెడ్యూల్ ను ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
రేపటి నుంచి పవన్ షెడ్యూల్ ఇదే..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. జులై తొమ్మిదో తేదీ సాయంత్రం ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం అవుతారు. ఇక పదకొండో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. ఇక 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ మేరకు పార్టి కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన చేశారు.
వారాహి విజయ యాత్ర కమిటీలతో పవన్ భేటీ..
ఆదివారం నుంచి వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభం కానున్న సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకులతో సమావేశం అయ్యారు. మంగళగిరిలోని పార్టి కేంద్ర కార్యాలయంలో వారాహి విజయ యాత్ర కమిటీ సభ్యులతో పవన్ భేటీ అయ్యారు. తొలి విడతలో జరిగిన వారాహి యాత్రలో కమిటి పని తీరును పవన్ అభినందించారు.
మిమ్మల్ని మర్చిపోను...
వారాహి విజయ యాత్రలో తనతో కలసి నడిచిన పార్టి శ్రేణులకు పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మీ సేవ మర్చపోలేనని, అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. మీరు పడిన కష్టం వృథా కాదని పవన్ నాయకులకు భరోసా కల్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమయిన ముద్ర వేస్తుందని పవన్ ఆకాంక్షించారు.
గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాల నుంచే అధికార వైసీపీ పతనం ప్రారంభం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి పతనం ప్రారంభం అయితే, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన శ్రేణులు ఎంత బలంగా పని చేస్తే అంత త్వరగా రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టగలమని పవన్ అన్నారు.
సాగునీటి కోసం రైతులు పోరాటం చేయాల్సి రావడం దారుణం... నాదెండ్ల
రైతులు నీటి కోసం పోరాటం చేసే పరిస్థితులు రావడం దారుణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వానికి వ్యవసాయం, నీటి పారుదల రంగాల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నా ఈ ప్రభుత్వానికి స్పందన లేదనీ, స్పందించే గుణం లేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రైతాంగం కలసి రావాలని కోరారు. జనసేన పార్టీ ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట గత 11 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలో పాల్గొని జనసేన పార్టీ తరపున నాదెండ్ల సంఘీభావం తెలిపారు.