Posani Jagan : పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ బంపర్ ఆఫర్ - ఆ సంస్థకు చైర్మన్ పదవి !
పోసాని సేవలను జగన్ గుర్తించారు. ఓ కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రకటించారు.
Posani Jagan : వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జీవోలో ప్రకటించారు. ఈ నియామకానికి సంబంధించి ఇతర వివరాలతో మరో ఉత్తర్వు జారీ చేస్తామని ఐ అండ్ పీఆర్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టీ విజయ్ కుమార్ రెడ్డి పేరుతో జీవో విడుదలయింది.
పోసాని విధేయతను ఇన్నాళ్లకు గుర్తించిన సీఎం జగన్
పోసాని కృష్ణమురళి సీఎం జగన్‌కు వీరాభిమాని. ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే.. బూతులతో విరుచుకుపడతారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌తో పాటు పవన్ కల్యాణ్, మెగా ఫ్యామలీ అందర్నీ ఆయన అసభ్యంగా దూషించిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ.. పదవి లభించలేదు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల అంశంపై సంప్రదింపులు జరిపినప్పుడు .. అలీతో పాటు పోసానిని కూడా ఆహ్వానించింది. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి మరోసారి సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అప్పట్లోనే పదవి లభిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆలస్యంగా ఇప్పుడు పదవి ఇచ్చారు.
ఫిల్మ్, టీవీ, నాటక రంగ కార్పొరేషన్ చైర్మన్‌గా చాన్స్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏపీఎస్‌ఎఫ్‌టీటీడీసీ ) సినిమా టీవీ, నాటక రంగానికి సంబంధించినది. ఈ పదవిలో ఆయన ఎంత కాలం ఉంటారన్నది ఉత్తర్వుల్లో లేదు. బహుశా ఏడాది వరకూ పదవి ఉంటుందని. .. ఆ తర్వాత పొడిగిస్తారని చెబుతున్నారు. ఇటీవలే టాలీవుడ్‌కు చెందిన మరో వైఎస్ఆర్‌సీపీ నేత అలీకి సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారు. ఆ పదవితో ఆలీ సంతృప్తి చెందారు. తన కుమార్తె పెళ్లికి జగన్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానని సంతోషపడ్డారు. ఆయనకు రెండేళ్ల పదవీ కాలం ఉంది.
వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేసిన మోహన్ బాబుకు మాత్రమే పెండింగ్ !
వైఎస్ఆర్‌సీపీ కోసం టాలీవుడ్‌లో పని చేసిన వారందరికీ సీఎం జగన్ మూడున్నరేళ్ల తర్వాతైనా పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. మొదట్లోనే ఫృధ్వీకి చాన్సిచ్చారు. అయితే వివాదాల కారణంగా పదవిని పోగొట్టుకున్నారు. తర్వాత తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని ఆరోపిస్తూ.. పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన సీఎం జగన్‌తో పాటు వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ కోసం యాక్టివ్‌గా పని చేసి ఇప్పటికీ ఏ పదవి పొందలేకపోయిన వారిలో ఇంకా మోహన్ బాబు మిగిలి ఉన్నారు. కానీ ఆయన ఇటీవలి కాలంలో ఆ పార్టీలో ఉన్నారో లేరో అన్నట్లుగా ప్రకటనలు చేస్తూండటంతో ఏ పదవి ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.
ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమి ఆక్రమించారు - సీఐడీ డీఐజీ సునీల్ నాయక్