Chandababu Jr NTR Meet : త్వరలో చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ భేటీ- ఈ ప్రచారంలో నిజమెంత?
Chandababu Jr NTR Meet : టీడీపీ అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 10న భేటీ కానున్నారని ప్రచారం నడుస్తోంది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొందని తెలుస్తోంది.
Chandababu Jr NTR Meet : టీడీపీ అధినేత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారా. అవుననే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఓ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. జనవరి 10న హైదరాబాద్ లో చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ భేటీ అవుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొందని ఆ సమాచారం సారాంశం. ఒక వేళ ఈ భేటీ నిజంగా జరిగితే ఏం చర్చిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయపరంగా చర్చ జరుపుతారా? అనే ఆసక్తి నెలకొంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తారకరత్న తన పొలిటికల్ కెరీర్‌పై ఇటీవల అప్‌డేట్ ఇచ్చారు. అదే సమయంలో తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని కూడా అన్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్‌లో ఉన్నారు. అదేటైంలో ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన కొన్ని అవార్డు ఫంక్షన్‌లో జూనియర్ పాల్గొనాల్సి ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తిరుగుతున్నట్టు పదో తేదీ నాటికి జూనియర్ అమెరికాలో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు పంక్షన్‌లో ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ ఊహాగానం ఎలా ఎవరు సృష్టించారో తెలియడం లేదు. ఒక వేళ కలిసే అవకాశం ఉంటే సంక్రాంతి టైంలో చాన్స్ ఉందని తెలుస్తుంది.
అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ
బీజేపీ అగ్రనేత అమిత్ షా గత ఏడాది హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపింది. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారనేది అప్పట్లో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కచ్చితంగా రాజకీయాలపైనే అని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఈ భేటీ వల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగలేదు.
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తరచూ వార్తలు వస్తుంటాయి. అటు వైసీపీ నేతలతో పాటు టీడీపీ నేతలు ఈ విషయంలో స్పందిస్తుంటారు. టీడీపీకి గతంలో ప్రచారం చేసిన జూ.ఎన్టీఆర్ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి ఏపీలో రాజకీయాలు కీలకంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని టీడీపీ పక్కా ప్లాన్ వేస్తుంది. అందుకు తనకున్న అన్ని ఆయుధాలను సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. జూ.ఎన్టీఆర్ రంగంలోకి దించాల్సిన టైం వచ్చిందని టీడీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. జూ.ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తే విజయావకాశాలు మరింత పెరుగుతాయని వారి భావన. అంతే కాకుండా మంచి వాక్ చాతుర్యం ఉన్న జూ.ఎన్టీఆర్ ప్రచారం చేస్తే టీడీపీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వైసీపీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే జూ.ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. వచ్చే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకుంటారని, చంద్రబాబు మరో పార్టీ పెట్టుకుంటారని కూడా చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని జోస్యం కూడా చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తాయన్నారు. ఈ వ్యాఖ్యల తరుణంగా చంద్రబాబుతో జూ.ఎన్టీఆర్ భేటీ సర్వత్రా ఆసక్తి రేపుతోంది.