(Source: ECI/ABP News/ABP Majha)
Amaravati Yatra : 600 మంది మాత్రమే యాత్ర చేయాలి - అమరావతి రైతులకు హైకోర్టు ఆదేశం!
అమరావతి రైతుల పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. మద్దతిచ్చేవారు రోడ్డుకిరువైపులా ఉండవచ్చని తెలిపింది.
Amaravati Yatra : అమరావతి రైతుల పాదయాత్రలో పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొనవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. వారు రోడ్డుకు ఇరవైపులా నిలబడి మద్దతు తెలియచేయవచ్చునని.. కానీ పాదయాత్రలో పాల్గొనవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్రలో కేవలం నాలుగు వాహనాలు మాత్రమే వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు ఉందని కూడా హైకోర్టు తెలిపింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
పాదయాత్రకు అనుమతి ఇచ్చిన మేరకు నిబంధనలు పక్కాగా పాటించాలన్న హైకోర్టు
హైకోర్టు విధించిన నిబంధను పాటించడంలో విఫలమైతే మాత్రం అమరావతి పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అడ్డంకులు కల్పిస్తోందని, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాదయాత్రను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. వీటిపై హైకోర్టు విచారణ కొనసాగించనుంది.
పాదయాత్రను అడ్డుకుంటున్నారని హైకోర్టుకు వెళ్లిన రైతులు
ముందుగా అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చివరికి రైతులు హైకోర్టులో పిటిషన్ వేసి అనుమతి తెచ్చుకున్నారు. 600 మంది రైతులు పాదయాత్ర చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే పాదయాత్ర ప్రారంభం నుంచి రైతులు మాత్రమే కాకుండా వారికి మద్దతిస్తున్న వారు కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటున్నారు. రైతులతో కలిసి నడుస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు పలుచోట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్దతుదారులు నడవకూడదని హైకోర్టు చెప్పలేదని వాదించారు. కానీ పలు పాదయాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అడ్డుకుంటామని ప్రకటిస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. విశాఖ లో నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో ఏర్పడిన కమిటీ.. రైతులు పాదయాత్ర విరమించాలని పలుమార్లు హెచ్చరించింది.
రైతులు రెచ్చగొడుతున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రభుత్వం
గోదావరి జిల్లాల్లో ప్రవేశించే సరికి పాదయాత్రపై వైఎస్ఆర్సీపీ నాయకుల నిరసనలు ప్రారంభమయ్యాయి. తణుకులో రైతులకు వ్యతిరేకంగా ర్యాలీతో పాటు బహిరంగసభ నిర్వహించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ వర్గీయులు రైతులపై రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడులు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర నాయకులు పెద్ద ఎత్తున రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. అమరావతి రైతుల కాళ్లు విరగ్గొడతామంటున్నారు. అదే సమయంలో రైతులు రెచ్చగొడుతున్నారని .. వారి పాదయాత్ర అను్మతి రద్దు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.