Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rains In AP And Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
అటు, దక్షిణ కోస్తాలోనూ భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకూ సముద్రం అలజడిగా ఉంటుందని గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. వర్షాల సమయంలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో రాబోయే 3 రోజులు
అల్పపీడన ప్రభావంతో అటు తెలంగాణలోనూ (Telangana) రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 3 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు గంటకు 40 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
Also Read: Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం