ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వాన- లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
బుధవారం అత్యధికంగా ఏలూరు జిల్లాలో నమోదు అయింది. అక్కడ 7.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయింది. తర్వాత విశాఖ జిల్లాలో రిజిస్టర్ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గ్యాప్ లేకుండా నిన్నటి నుంచి వాన ధారలా పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వానలు కుమ్మేస్తున్నాయి. ప్రజలకు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా వర్షం కురుస్తోంది.
బుధవారం అత్యధికంగా ఏలూరు జిల్లాలో నమోదు అయింది. అక్కడ 7.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయింది. తర్వాత విశాఖ జిల్లాలో రిజిస్టర్ అయింది. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని రెండు రోజులుగా చెబుతున్న వాతావరణ శాఖాధికారులు పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాలు ముంపు బారిన పడితే అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అంబేడ్కర్, ఏలూరు జిల్లాల్లో నాలుగేసి సహాయక బృందాలను పంపించారు. ప్రత్యేక బోట్లు, లైఫ్ జాకెట్లు కూడా సిద్ధం చేశారు.