AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణ స్వీకారం - 30కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
AP High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కొత్తగా నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ వారితో ప్రమాణం చేయించారు.
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, సుమతి జగడం, మండవ కిరణ్మయి, న్యాపతి విజయ్ శనివారి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు.
న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. కేంద్ర న్యాయ శాఖ వీరి నియామకానికి ఈ నెల 18న ఉత్తర్వులిచ్చింది.
30కు చేరిన న్యాయమూర్తులు
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు ప్రస్తుతం 27 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన వారితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కు చేరింది.
గవర్నర్ తో సీఎం భేటీ
న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి ముందు ఏపీ సీఎం జగన్, గవర్నర్ నజీర్ తో రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, నవంబర్ 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ ను సీఎం ఆహ్వానించినట్లు తెలుస్తోంది.