Fire Accident: పోలీస్ క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం, స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ దగ్ధం!
Fire Accident: తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వస్తువులు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
Fire Accident: తూర్పు గోదావరి కడియం పోలీస్ ఇన్స్ పెక్టర్ క్వార్టర్స్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, బెల్లం, ఖైని, సారా కాసే పాత్రలు సహా పలు వస్తువులు కాలి బూడిదైపోయాయి. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియరాలేదు. కడియం పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న క్వార్టర్స్ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఇటీవలే ఈ వస్తువులను అందులోకి మార్చి నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఈ రోజు ఉదయం వస్తువులు ఉన్న గదిలో నుంచి మంటలు వచ్చినట్లు తెలిపారు.
విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగారు సిబ్ంది. ఉవ్వెత్తున లేస్తున్న మంటల్లోకి ఫైర్ ఇంజిన్ల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఆ బిల్డింగ్ లో కరెంట్ కూడా లేదని పోలీసులు పేర్కంటున్నారు. మరి ప్రమాదం ఎలా జరిగి ఉంటుందనే దానిపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలతను సంప్రదించగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియ జేస్తామని వివరించారు.
తాజాగా మన్యం జిల్లాలోని బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం..
ఎలక్ట్రిక్ వెహికల్ షోరూములో అగ్ని ప్రమాదాలు నిత్య కృత్యం అవుతున్నాయి. ఏదో ఒక చోట ఈవీ షోరూముల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల కొద్దీ రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. వివిధ కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూముల్లో అగ్ని ప్రమాద ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని ఓ బైక్ షోరూములో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. విద్యుత్ వాహనాలు(ఎలక్ట్రిక్ వెహికల్స్) విక్రయించే షోరూములో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో దాదాపు 36 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూర్తిగా కాలి పోయి బూడిద అయ్యాయి. టైర్లు, సీట్లు, ఫైబర్, ఇతర ప్లాస్టిక్ తో తయారు చేసినవి మొత్తం కాలిపోయాయి. కేవలం ఐరన్ తో చేసిన ఫ్రేములు మాత్రమే మిగిలాయి. మంటలతో వచ్చిన పొగలు చూసిన స్థానికులు, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. చుట్టు పక్కల వారు ఇచ్చిన సమాచారంతో అగ్ని ప్రమాదం జరిగిన షోరూముకు చేరుకును అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాదంలో షోరూములో ఉన్న మొత్తం 25 వాహనాలు కాలి బూడిద అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాటరీలు కూడా మంటలకు కాలిపోయాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగిసి పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం పూర్తి స్థాయి విచారణలో తెలుస్తుందని వెల్లడించారు. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు షోరూము యజమానులు తెలిపారు.