Eluru Rains : కొండవాగులో కొట్టుకుపోయిన కారు, కాపాడేందుకు ప్రయత్నించినా!
Eluru Rains : ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురం పడమటి కాలువలో కారు కొట్టుకుపోయింది.
Eluru Rains : ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుంది. ఏజెన్సీలోని ప్రధాన రహదారులపై కొండ వాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురం పడమటి కాలువ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారుతో సహా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. తూర్పు కాలువ వద్ద కొండవాగు ఉద్ధృతిలో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తుల కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. కొండవాగుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఏపీలో వర్షాలు
ఏపీలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో పిడుగులు పడే పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర లోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం ఉపరితల ద్రోణి తూర్పు రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ- 3.1 కి.మీ మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి మీ వరకు వ్యాపించి ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ అతి భారీ వర్షాలతో పాటు రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిచింది.