Eluru News : ప్రైవేట్ బ్యాంక్ లో నగదు గోల్ మాల్, పురుగుల మందు డబ్బాతో ఖాతాదారుడు ఆందోళన!
Eluru News : జంగారెడ్డిగూడెంలోని ఓ బ్యాంక్ లో ఖాతాదారుడు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. తన డిపాజిట్ నగదు బ్యాంక్ సిబ్బంది డ్రా చేసుకున్నారని ఆరోపించాడు.
Eluru News : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద సోమవారం ఖాతాదారుడు పురుగుమందు డబ్బాతో ఆందోళన చేశాడు. బ్యాంక్ మేనేజర్ నాగరాజు ఖాతాదారుల నగదు గోల్ మాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు వద్ద బాధితుడు ఆందోళన చేశారు. బాధితులు ఆందోళన చేయడంతో బ్యాంకు సిబ్బంది, మేనేజర్ బ్యాంకుకు తాళాలు వేసి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు.
అసలేం జరిగింది?
తమ డిపాజిట్ నగదు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఐసీఐసీఐ బ్యాంక్ ముందు వేముల దుర్గారావు అనే డిపాజిట్ దారుడు కుటుంబ సభ్యులతో ఆందోళన కు దిగాడు. ఐసీఐసీఐ బ్యాంక్ లో 2020 డిసెంబర్ లో అయిదు లక్షల రూపాయలు డిపాజిట్ చేశానని గడువు తీరినప్పటికీ డిపాజిట్ డబ్బులు ఇవ్వకుండా ఆరునెలల నుంచి బ్యాంక్ సిబ్బంది తిప్పుకుంటున్నారని వేముల దుర్గారావు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తన డిపాజిట్ డబ్బులు తనకు ఇవ్వాలని దుర్గారావు డిమాండ్ చేస్తున్నారు. తనకు తెలియకుండా బ్యాంక్ సిబ్బంది డబ్బులు డ్రా చేసినట్లు దుర్గారావు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తన డిపాజిట్ డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పురుగులమందు సీసాతో బ్యాంక్ ముందు బాధితుడు ఆందోళనకు దిగాడు. వివాదం ముదరడంతో బ్యాంక్ మేనేజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న దళారులు
మూడు రోజుల క్రితం గుజరాత్ కు చెందిన 540 మంది భక్త బృందం వివిధ ఆలయాలను సందర్శిస్తూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుపతిలో తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ వ్యక్తి టూరిజంకు చెందిన మరోక వ్యక్తిని వారికి ఫోన్ ద్వారా పరిచయం చేయించారు. అయితే తమకు తెలిసిన లాడ్జ్ యజమాని ఉన్నారని, అతని ద్వారా దర్శనాలు చేయిస్తామని టూరిజానికి చెందిన వ్యక్తి భక్త బృందానాన్ని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన భక్తులు తిరుపతిలోని ఓ లాడ్జ్ యజమానికి దాదాపు 6.8 లక్షల రూపాయలు ఫోన్ ఫే, గూగుల్ ఫే ద్వారా నగదును జమచేశారు. అయితే భక్త బృందం నగదు జమ చేసిన మరుసటి రోజు టూరిజం, లాడ్జ్ యజమాని ఫోన్ చేసి దర్శన టోకెన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ మాటలు నమ్మిన భక్తులు నేరుగా తిరుపతికి చేరుకుని టూరిజం శాఖకు చెందిన ఉద్యోగితో పాటు లాడ్జ్ యజమాని వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే తాము ముందస్తుగా ప్లాన్ చేసిన నకిలీ టోకెన్లను డాక్యుమెంట్ రూపంలో ఫోన్ లో సిద్ధం చేసి వారికి పంపించారు. వాటిని జిరాక్స్ తీసుకుని తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు.
అది నమ్మిన భక్త బృందం జిరాక్స్ కోసం షాపునకు వెళ్లగా ఆ టికెట్లను చూడగానే ఇవి నకిలో టోకెన్లని జిరాక్స్ షాపు యజమాని చెప్పడంతో తేరుకున్న భక్తులు తిరుపతిలోని టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించారు. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నమ్మిపోసిన గుజరాతీయులకు న్యాయం చేసేందుకు వివరాలు తీసుకుని టూరిజం, లాడ్జ్ యజమాని అదుపులోకి తీసుకుని నగదుని భక్త బృందానికి తిరిగి అప్పగించారు. అయితే భక్త బృందాన్ని మోసగించిన టూరిజం శాఖ ఉద్యోగి, లాడ్జ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.