Central Funds To AP : ఏపీకి రూ.23 వేల కోట్ల ఆర్థిక సాయం, పార్లమెంట్ లో కేంద్రం ప్రకటన
Central Funds To AP : విభజన హామీలతో ఏపీకి రూ.23 వేల కోట్ల ఆర్థిక సాయం చేశామని పార్లమెంట్ లో కేంద్రం స్పష్టం చేసింది.
Central Funds To AP : విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటి వరకూ ఏపీకి రూ.23,110.47 కోట్లు ఆర్థిక సాయం చేశామని కేంద్రం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1750 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 13,226.772 కోట్లు ఏపీకి ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015-20 మధ్య కాలంలో ఏపీ సంతకాలు చేసిన విదేశీ ప్రాజక్టులపై తీసుకున్న రుణాలకు రూ.15.81 కోట్ల వడ్డీ చెల్లింపులు కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద 2019-20 నుంచి 2022-23 మధ్య ఏపీకి రూ.4199.55 కోట్లు విడుదల చేశామన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఏపీకి నూతన రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చామని పేర్కొంది. ఏపీ విభజన చట్టం హామీల అమలు, అందిస్తున్న సాయంపై ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్‌చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలోని నిబంధనలు, నీతి ఆయోగ్ సిఫార్సులతో ఏపీకి ఆర్థికసాయం అందిస్తున్నామని కేంద్రం వెల్లడించింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే - ఎంపీ మిథున్ రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తక్షణమే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టులా ముందుకు తీసుకువెళ్లడం లేదన్నారు. భూ సేకరణ చట్టంతో అంచనా వ్యయం పెరిగిందన్న మిథున్ రెడ్డి... రూ.55,548 కోట్ల సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ దీనిని ఇప్పటి వరకూ ఆమోదించలేదన్నారు. ఇరిగేషన్ కాంపోనెంట్, డ్రింకింగ్ కాంపోనెంట్ అనే పేరుతో ప్రాజెక్టు నిధులు తగ్గిస్తున్నారన్నారు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు లేని కండిషన్లు పెట్టి నిధులను తగ్గిస్తున్నారని తెలిపారు.
ఏపీపై అప్పుల భారం
భూసేకరణ చట్టం కింద పరిహారాన్ని నేరుగా రైతులు ఖాతాల్లో వేయాలని ఎంపీ మిథున్ రెడ్డి సూచించారు. జాతీయ ప్రాజెక్టును కేంద్రం సరైన విధానంలో నిర్వహించలేదన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. విభజనతో ఏపీ తలసరి ఆదాయం రూ.8979 తగ్గిందన్నారు. ఏపీకి 56 శాతం జనాభా వస్తే 45 శాతం ఆదాయం మాత్రమే దక్కిందన్నారు. కానీ 60 శాతం అప్పులు ఏపీ రుద్దారన్నారు. ఈ నష్టం కారణంగానే ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు ప్రధాని చెప్పారన్నారు. మంత్రివర్గంలో ఆమోదించినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని వందలసార్లు పార్లమెంటులో అడిగిన కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.