CRY Analysis Report: ఏపీలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళనకరం!
Walk to EmpowHER: ఏపీలో బాలికల పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడలేదని, బాలికల విద్య, ఆరోగ్య, రక్షణ విషయాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని స్వచ్ఛంద సంస్థ CRY పేర్కొంది.
Girl Children in Andhra Pradesh: విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో బాలికల పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడలేదని, బాలికల విద్య, ఆరోగ్య, రక్షణ విషయాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని ప్రముఖ భారత స్వచ్ఛంద సంస్థ CRY చైల్డ్ రైట్స్ అండ్ యు పేర్కొంది. ఈ నెల 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం (National Girl Child Day) జరుపుకోనున్న సందర్భంగా.. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి వివిధ ప్రభుత్వ నివేదికలను విశ్లేషిస్తూ CRY ఒక నివేదిక విడుదల చేసింది.
CRY నివేదిక ప్రకారం ఏపీలోని పాఠశాలల్లో బాలికల నమోదు ప్రాధమిక విద్య స్థాయిలో అత్యధికంగా ఉండగా.. సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో చాలా తక్కువగా ఉంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) 2021-22 గణాంకాల ప్రకారం.. ఏపీలో ప్రాథమిక విద్య స్థాయిలో 80% కన్నా ఎక్కువ మంది బాలికలు పాఠశాలల్లో చేరగా, సెకండరీ స్థాయిలో 49%, హయ్యర్ సెకండరీ స్థాయిలో 37% శాతం మంది బాలికలు మాత్రమే స్కూళ్లలో చేరారు.
ఏపీలో పోక్సో కేసులు
బాలికల మీద అత్యాచారం, లైంగికదాడుల నేరాల పెరగడం గమనిస్తే.. వారి భద్రత, రక్షణ అంశం కూడా ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో ఏపీలో పోక్సో చట్టం కింద 1,000 మందికి పైగా మైనర్ బాలికలు అత్యాచార బాధితులుగాను, మరో 1,000 మంది మైనర్ బాలికలు లైంగిక దాడులు, వేధింపుల బాధితులుగాను నమోదైంది.
65% మందికి పైగా రక్తహీనత
బాలికల ఆరోగ్యం, పోషకాహారం విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5 2019-21) నివేదిక ప్రకారం.. ఏపీలో 15-19 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 65% మందికి పైగా రక్తహీనత ఉన్నట్లు అంచనా వేశారు. 20-24 సంవత్సరాల మహిళలలో 29% మందికి 18 సంవత్సరాల వయసు కంటే ముందే వివాహం జరిగినట్లు అంచనా. అంటే వివాహం, మాతృత్వం అనే భారాలను మోయటానికి మానసికంగానూ శారీరకంగానూ సిద్ధం కాకముందే వారికి పెళ్లిళ్లు జరిగాయి. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లపై CRY విడుదల చేసిన నివేదిక పరిశీలిస్తే.. బాలికల హక్కలకు సంబంధించి విద్య, రక్షణ, ఆరోగ్యం-పోషకాహారం అనే మూడు ప్రధాన అంశాలపైన దృష్టి సారించింది.
CRY సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో బాలికల పరిస్థితులను మెరుగుపరచడానికి వరుస ప్రభుత్వాలు క్రియాశీలంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మరింత కేంద్రీకృతంగా, సమిష్టిగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. బాలికలపై నేరాలను అరికట్టడం, విద్యకు సంబంధించి ఉన్నత తరగతులలో వారి నమోదును పెంచడం, బాల్య వివాహాలను నిరోధించడం, వారి ఆరోగ్యం, పోషకాహార పరిస్థితులను మెరుగు పరచాలని’ పేర్కొన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం, పౌర సమాజం సమిష్టిగా కృషి చేయాలని జాన్ రాబర్ట్స్ పిలుపునిచ్చారు.
బాలికలు లక్ష్యంగా ప్రాధాన్యత కల్పించి వనరులను కేటాయించి, వాటిని సమర్థవంతంగా అమలయ్యేలా ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలన్నారు. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. ‘బాలికలను సాధికారం చేద్దాం’ (Walk to EmpowHER!) అనే పిలుపుతో CRY ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం లోని ఆర్.కె. బీచ్‌లో అవగాహన వాక్ ను నిర్వహిస్తోంది. విశాఖపట్నంతో పాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు – నాలుగు దక్షిణాది రాష్ట్రాల నగరాల్లో CRY అదే రోజున ఈ తరహా అవగాహన నడకలను నిర్వహిస్తోంది. ‘ఇది కేవలం నడక మాత్రమే కాదు; భారతదేశ బాలికలకు భవిష్యత్తును రూపొందించే దిశగా ఇది ఒక శక్తివంతమైన ప్రయాణమని జాన్ రాబర్ట్స్ చెప్పారు.