Anganwadi Strike: వేతనాల పెంపు కష్టమే! అంగన్వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం
Anganwadi Strike For Salaries Hike: అంగన్వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది లేదని అంగన్వాడీలకు సర్కార్ తేల్చి చెప్పింది.
Anganwadi Association News: అమరావతి: అంగన్వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది లేదని అంగన్వాడీలకు సర్కార్ తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాల పెంచే అవకాశం లేదని మంత్రుల కమిటీ అంగన్వాడీలకు స్పష్టం చేసింది. సంక్రాంతి తరువాత మరోసారి చర్చిద్దామని సర్దిజెప్పే ప్రయత్నం ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. జాప్యం జరుగుతోంది కానీ తమకు న్యాయం జరగడం లేదని, డిమాండ్లను పరిష్కరించడం లేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అంగన్వాడీలు సమ్మె (Anganwadi Strike) విరమించాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని సూచించినా.. జీతాలు పెంచే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటుందని మంత్రి బొత్స వారిని హెచ్చరించారు.
సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో చర్చలు..
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంగళవారం సాయంత్రం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీ సంఘాలు డిమాండ్ చేశాయి. 1.64 లక్షల మందికి వేతనాలు పెంచడానికి సర్కార్ వద్ద నిధులు లేవని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అంగన్వాడీలకు జీతాలు పెంచేది లేదని కమిటీ తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది ఎన్నికలు ముగిసిన తరువాత వేతనాల పెంపుపై చర్చిద్దామని అంగన్వాడీ సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రాట్యుటీ అమలు కోసం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని సూచించారు.
జనవరి 5నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు,చిన్నారులకు టేక్ హోం రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు.సంక్రాంతి అనంతరం మరలా కూర్చుని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ణప్తి చేశారు.
ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి 11 డిమాండులకు గాను 10 డిమాండులను పరిష్కరించడమే గాక 4అంశాలకు సంబంధించి అనగా పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు పెంపు,పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు,టిఏడిఏలు,అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని50 వేల రూ.లు నుండి లక్ష రూ.లకు,సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25 వేల నుండి 40 వేల రూ.లకు పెంచడం వంటి వాటిపై జిఓలను కూడా జారీ చేశామన్నారు.మిగతా అంశాలపై రెండు మూడు రోజుల్లో జిఓలను జారీ చేయడం జరుగుతుందని మంత్రుల బృందం స్పష్టం చేసింది. ఒకే ఒక్క డిమాండు అనగా గౌరవ వేతనం పెంపు అంశం మిగిలి ఉందని దీనిపై సంక్రాంతి తర్వాత మరలా సమావేశమై చర్చించి దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పింది.
అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల తరపున సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రటరి ఎం.సుబ్బరావమ్మ, రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల రాష్ట్ర అధ్యక్షురాలు జి.వేణి రాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్వాడీ హెల్పర్ల ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి.భారతి,సెక్రటరి విఆర్.జ్యోతి, ఎఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ, వైస్ ప్రెసిడెంట్ ప్లారెన్స్, జనరల్ సెక్రటరి జె.లలిత తదితరులు పాల్గొన్నారు.
బుధవారం నుంచి ఎమ్మెల్యేల నివాసాలు ముట్టడి!
ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో తమ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్టు సమావేశం ముగిసిన తర్వాత అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. ‘‘15 రోజులుగా సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ఎలాంటి ఫలితంలేదు. అంగన్వాడీలు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ చొరవ తీసుకుని తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. గత వారం నుంచి సమగ్ర శిక్ష సిబ్బంది కూడా అంగన్వాడీలతో కలిసి సమ్మెలో పాల్గొంటున్నారు.