Chandrababu: 175 కి 175 స్థానాల్లో టీడీపీ గెలవాలన్న చంద్రబాబు- పొత్తులపై క్లారిటీ ఇచ్చారా!
TDP will win 175 out of 175 seats: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 175 కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలి అన్నారు.
TDP will win 175 out of 175 seats: రాబోయే ఏడు నెలలు చాలా కీలమైనవని, నేతలందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 175 కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలి అన్నారు. రాష్ట్రం కోసం, రాబోయే తరాల మహత్తర భవిష్యత్తు కోసం మనమందరం పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో "భవిష్యత్‍కు గ్యారెంటీ"పై బస్సు యాత్ర, ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా లేదా హాట్ టాపిక్ గా మారింది. బాబు వ్యాఖ్యలను గమనిస్తే టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని సంకేతాలు ఇచ్చారా అనిపిస్తుంది.
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మనస్సాక్షి లేని సైకో జగన్ రెడ్డి నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇంతటి అవినీతి, నేరస్థుల పాలన నా రాజకీయ జీవితంలో చూడలేదు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లాం. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం నాయకులుగా మన బాధ్యత. ఆవిర్భావం నుంచి టీడీపీ కార్యకర్త ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నాడు. నేను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మిగులు విద్యుత్ సాధిస్తే జగన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాడు. కరెంటు చార్జీలు పెంచకుండా ఉత్పత్తి ఖర్చు తగ్గించాం. జగన్ రెడ్డి నాలుగేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు. మార్కెట్లో యూనిట్ రూ. 10 పెట్టి కరెంటు కొంటున్నారు. మీటర్ల నుంచి సోలార్ ప్లాంట్ల వరకూ అంతా అవినీతే అంటూ’ మండిపడ్డారు చంద్రబాబు.
‘ధరలు పెరిగి ఆదాయం తగ్గడానికి అసమర్థ ముఖ్యమంత్రే కారణం. దీపం పథకం తో నాడు సిలిండర్లు ఇస్తే నేడు జగన్ వంట గ్యాస్ ధరలు పెంచేశారు. భూముల ధరలు ఇంతలా పతనం కావడానికి జగన్ రెడ్డి కారణం కాదా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి దోచుకుతింటున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి అవినీతికి పాల్పడుతున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు. మహిళలు ప్రజా సమస్యలపై మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకూ వెనకాడటంలేదు. మద్యపాన నిషేధం పేరుతో మాయమాటలు చెప్పి జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్లు తానే కట్టించానని జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నివాస యోగ్యమైన ఇళ్లను నేను కట్టిస్తే జగన్ రెడ్డి సెంటు భూమిలో ఇల్లు పేరుతో మోసం చేస్తున్నాడు. గంజాయి పెరిగిపోయిందని ఢిల్లీకి వెళ్లి మనం చెబితే మన కార్యాలయంపై దాడి చేశారు. ప్రతిపక్ష కార్యాలయాలు, అధ్యక్షుడిపై దాడులు చేస్తే భయపడతారని భావించారని’ చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసే అర్హత ఉందా?
అక్కను ఏడిపిస్తున్నారని ప్రశ్నించినందుకు గంజాయి తాగిన వెధవలు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోలో పోసి తగలబెట్టేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ ను పెంచి పోషించింది ఈ జగన్ రెడ్డి కాదా?జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసే అర్హత ఉందా? రాష్ట్రంలో ఎక్కడ చూసిన బ్లేడ్ బ్యాచ్, గన్ కల్చర్ చెలరేగిపోతున్నారు. రూ.40వేల కోట్ల ఆస్తులను గన్ చూపించి బెదిరించి లాక్కున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్ని ఇంట్లో గృహ నిర్భందం చేసి డబ్బులు ఇవ్వమని గంజాయి తాగుతూ హింసించారని ఎంపీ కొడుకు స్వయంగా చెప్పారు. వైజాగ్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేక ఆ ఎంపీ హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారంటే జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? సత్యసాయి జిల్లాలో రూ.12 కోట్ల ఆస్తి బలవంతంగా కబ్జా చేసి రాయించుకుంటే ఎవరూ సాయం చేయక ఆత్మహత్య చేసుకున్నారు. మచిలీపట్నంలో ఆవుల సతీష్ అనే వైకాపా నాయకుడు అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఊరుకో వైసీపీ సైకో తయారయ్యాడు. అందుకే మనం ఇదేం ఖర్మ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చామని టీడీపీ అధినేత తెలిపారు.