Anantapur News: ఉమ్మడి అనంతపురంపై చంద్రబాబు ఫోకస్, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిఘా
TDP News: రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా పై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Chandrababu focuses on Anantapur District: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో వైసీపీకి అధికంగా రాయలసీమ నుంచే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కూడా రాయలసీమ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ మాత్రమే గెలుపొందారు.
రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా పై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. వచ్చే ఎన్నికల్లో సర్వేల ఆధారంగా గెలిచే నేతలకే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను చంద్రబాబు అలర్ట్ చేశారు. మీ పనితీరు బాగుంటేనే ఈసారి టికెట్ దక్కుతుందని జిల్లా నేతలకు సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఉన్న నేతలందరూ తమ నియోజకవర్గాల్లో బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
ఇప్పటికే చంద్రబాబు బస్సు యాత్రలో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకటప్రసాద్ ఆశీర్వదించాలని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగిస్తున్నారు. అనంతపురం అర్బన్ లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. రాప్తాడు నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం ఇన్చార్జి గా కొనసాగుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సగం నియోజకవర్గాలలో వర్గపోరు సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా శింగనమల నియోజకవర్గంలో వర్గపోరు తారా స్థాయిలో కొనసాగుతోంది. టీడీపీ నియోజవర్గ ఇంచార్జ్ ఎవరన్నది సందిగ్దత నెలకోంది. ఇక్కడ బండారు శ్రావణశ్రీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇంచార్జ్ బాద్యతల నుంచి తప్పించి.. టూమ్యాన్ కమిటీని పార్టీ నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా బండారు శ్రావణిశ్రీ పర్యటిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోనూ టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కొనసాగుతున్నారు.
మడకశిర ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న కి టీడీపీ నేత గుండుమల తిప్పే స్వామికి వర్గపోరు నడుస్తుంది. పెనుగొండ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నప్పటికీ.. పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన కురుభ సవితమ్మ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సమస్యలు ఉన్న నియోజకవర్గాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.