Subramanian Swamy: చంద్రబాబు జోక్యం అనవసరం, సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు - పవన్ పైన కూడా
టీటీడీ విషయంలో చంద్రబాబు అబద్ధాల ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యన్ స్వామి అన్నారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్వారా ఆడిట్ చేయడానికి టీటీడీ తనంత తానే ముందుకు వచ్చిందని అన్నారు.
బీజేపీకి చెందిన నాయకుడు, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీకి చెందిన కార్యక్రమాలు, శ్రీవాణి ట్రస్టు వ్యవహారంపై సుబ్రహ్మణ్యన్ స్వామి స్పందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. వారిద్దరూ టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, శ్రీవాణి ట్రస్ట్ పైన కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు నేతలు ప్రజా క్షేత్రంలో పోరాడలేకనే ఈ ప్రచారం పట్టుకున్నారని ఆరోపించారు.
టీటీడీ విషయంలో చంద్రబాబు అబద్ధాల ప్రచారం చేస్తున్నారని, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్వారా ఆడిట్ చేయడానికి టీటీడీ తనంత తానే ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి సున్నితమైన మతపరమైన అంశాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, హిందూ దేవాలయ వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. తన రాజకీయాలు చూసుకుంటే చాలని హితవు పలికారు. తాను త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం చేసుకుంటానని చెప్పుకొచ్చారు.