ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్నబ్ తుపాను తీవ్రతను ఎదుర్కొనేందుకు, విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సాయాన్ని కోరింది.
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తీవ్ర తుపాను విద్యుత్ వ్యవస్థను దెబ్బతీయడంతో, పునరుద్ధరణ పనుల వేగవంతానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ సాయం కోరారు.

- ఆంధ్రప్రదేశ్ తుపాను విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ సహాయం అడిగింది.
- తెలంగాణ సానుకూలంగా స్పందించి, తక్షణమే సిబ్బంది, పరికరాలు పంపింది.
- సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ ద్వారా తుపాను పరిస్థితిని సమీక్షించి ఆదేశాలిచ్చారు.
- కూలిన చెట్లు తొలగించి, ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.
Cyclone Arnab | అమరావతి: అర్నబ్ తుపాను తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాయాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్, తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన అదనపు విద్యుత్ సిబ్బందిని, సాంకేతిక పరికరాలను, ఇతర సామాగ్రిని ఏపీకి పంపాల్సిందిగా మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేసిన అభ్యర్థనకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అర్నబ్ తుపాను విపత్తు వేళ ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ ముందుకు వచ్చి, తక్షణమే అవసరమైన సిబ్బందిని, విద్యుత్ సామాగ్రిని ఏపీకి పంపేందుకు అంగీకారం తెలిపింది. ఈ సహకారం వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం లభించింది.
తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడిన అనంతరం మంత్రి గొట్టిపాటి ఏపీలోని తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు నిరంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. విపత్తు సమయంలోనూ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు సమీక్ష.. అధికారులకు ఆదేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా తుపాను ప్రభావిత జిల్లాల పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. అర్నబ్ తీవ్ర తుపాను కదలికలు, ప్రభావంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆర్టీజీఎస్ అధికారులు సీఎంకు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలుల ధాటికి చెట్లు విరిగిపడి, స్తంభాలు నేలకూలి ఎక్కడైనా రాకపోకలకు ఆటంకం కలిగిందా అని ఆరా తీశారు. జాతీయ రహదారులతో పాటు ఇతర మార్గాల్లో కూలిన చెట్లను సాధ్యమైనంత వెంటనే తొలగించి అక్కడ ట్రాఫిక్‌ను తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అర్నబ్ తుపాను హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచే ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా ప్రభావిత జిల్లాలపై నిరంతర నిఘా ఉంచామని ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. అలాగే 'మనమిత్ర' వాట్సాప్ యాప్ ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేసి, ఆ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నట్లు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు.
Frequently Asked Questions
అర్ణబ్ తుపాను కారణంగా విద్యుత్ పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్ర సహాయాన్ని కోరింది?
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించింది?
తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. అవసరమైన సిబ్బందిని, విద్యుత్ సామాగ్రిని తక్షణమే పంపేందుకు అంగీకరించింది.
అర్ణబ్ తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు ఎక్కడ నుంచి సమీక్షించారు?
సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం (ఆర్టీజీఎస్) నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా తుపాను ప్రభావిత జిల్లాల పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.
అర్ణబ్ తుపాను సమయంలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి ఏ యాప్ ఉపయోగించారు?
'మనమిత్ర' వాట్సాప్ యాప్ ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేసి, సమస్యలను పరిష్కరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























