Lagadapati Rajagopal : ఆంధ్రా ఆక్టోపస్ దారేటు, మళ్లీ రాజకీయాల్లో వస్తారని జోరుగా చర్చ
Lagadapati Rajagopal : ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి మళ్లీ ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షం అయ్యారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది.
Lagadapati Rajagopal : బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఇప్పటికి ఈ పేరుకు రాజకీయాల్లో మంచి గిరాకీ ఉంది. కార్పొరేట్ రాజకీయాన్ని బెజవాడకు పరిచయం చేసిన వ్యక్తిగా లగడపాటి రాజగోపాల్ గుర్తింపు పొందారు. అంతే కాదు ఆంధ్రా ఆక్టోపస్ గా కూడా రాజగోపాల్ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్ రూపంలో ఊహించి ముందే చెప్పటంలో రాజగోపాల్ దిట్ట. అయితే రాష్ట్ర విభజన పరిణామాలు కారణంగా ఆయన రాజకీయాలను నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మరలా ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ కూడా మొదలైంది.
ఆంధ్రా ఆక్టోపస్ ఎగ్జిట్ పోల్స్ లో దిట్ట
లగడపాటి రాజగోపాల్ బెజవాడ మాజీ ఎంపీ. మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర అల్లుడు అయినప్పటికీ ఆయన రాజకీయ వారసుడిగా కాకుండా పారిశ్రామిక వేత్తగా ల్యాంకో అధినే గా రాజగోపాల్ మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజగోపాల్. ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ను బయటపెట్టి, ఏ పార్టీ విజయం సాధిస్తుంది. ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది. డిపాజిట్లు కూడా దక్కని పార్టీ ఏది అనే విషయాలను ఈవీఎం ఫలితాల కన్నా ముందే పసిగట్టి చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి. అయితే అది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. రాష్ట్ర విభజనకు ముందు రాజగోపాల్ ఇచ్చిన ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయి. జగన్ ప్రభుత్వంపై కూడా రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫెయిల్ అయ్యింది.
వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి, అన్నంత పని చేశారు లగడపాటి. విభజన తరువాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారు. రావాలి అంటూ బెజవాడ పార్లమెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆయన పుట్టిన రోజున విజయవాడతో పాటుగా చుట్టు పక్కల నియోజకవర్గాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లోకి వస్తారంటూ పోస్టర్లు వెలిశాయి. తాజాగా లగడపాటి, నందిగామ శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ను కలవటం, ఒక కార్యకర్త వివాహ వేడుకలో వైసీపీ నాయకులతో సమావేశం కావటం కూడా హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని, ఆయన విజయవాడ వైసీపీ పార్లమెంట్ కు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలను రాజగోపాల్ సన్నిహిత వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. మొదట్లో ఆయన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారని, అయితే ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల కాలం ఉండడంతో ఏమైనా జరగవచ్చని అంటున్నారు.