YSR Rythu Bharosa: రైతు భరోసా కింద 27,062 కోట్లు నేరుగా అన్నదాతల ఖాతాల్లోకి జమ: మంత్రి కాకాణి
వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకూ రూ. 27,062 కోట్ల మేర రైతు భరోసా సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకూ రూ. 27,062 కోట్ల మేర రైతు భరోసా సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో చేశామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
రైతు భరోసాకి బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్...
ప్రకృతి విపత్తుల సమయంలో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోపు 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ రూ.1,911.78 కోట్ల మేర ఇన్ పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని మంత్రి కాకాణి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా - పిఎం కిసాన్ పథకం క్రింద అర్హుడైన ప్రతి రైతుకు ఏటా రూ.13,500/-రైతు భరోసా సాయాన్ని విడతల వారీగా అందజేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ కౌలు రైతులు, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ఈ వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద రైతు భరోసా సాయంతో పాటు ప్రకృతి విపత్తువల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయాన్ని అదే సీజన్ ముగిసే లోపే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నారని చెప్పారు.
కేంద్రం సాయంతో కలిపి.... ఇలా
వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పధకం కింద తమ ప్రభుత్వం రైతన్నలకు విడతల వారీగా అందజేసే రైతుభరోసా సాయం విషయంలో కేంద్ర వాటా ఇంత, రాష్ట్ర వాటా ఇంత అంటూ ప్రతిపక్షాలు చిలవలు పలవలు చేస్తూ లేనిపోని రాద్దాంతం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అయినా కేంద్ర ప్రభుత్వం అందజేసే గ్రాంట్లను కలుపుకుని బడ్జెట్ అంచనాలను రూపొందిస్తామన్నారు. అయితే ప్రతిపక్షాలు, వారి మద్దతు మీడియా ఈ విషయంలో కనీస పరిజ్ఞానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందజేసే రైతుభరోసా సాయంలో కేంద్ర వాటా ఇంత, రాష్ట్ర వాటా ఇంత అంటూ ఏవేవో లెక్కల గారడీలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టడం విచిత్రంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటికైనా ప్రతిపక్షాలు, వారి మద్దతు మీడియా గుర్తించాలని ఆయన హితవు పలికారు.
మాండోస్ తుఫాను నష్టం....
2022 డిసెంబర్ నెలలో సంభవించిన మాండోస్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు అదే రబీ సీజన్ ముగిసే లోపుగా పెట్టుబడి సాయంగా రూ.76.99 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ పంపిణీ చేశారని గుర్తుచేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో జరిగిన పంట నష్టానికి కూడా అదే సీజన్ ముగిసేలోపు 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ రూ.1,911.78 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు.