(Source: ECI/ABP News/ABP Majha)
YSRCP Offices: రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు కూల్చివేత నోటీసులు - హైకోర్టు కీలక నిర్ణయం
Andhrapradesh News: రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు కూల్చివేత నోటీసుల పిటిషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ స్టేటస్ కో కొనసాగించాలని స్పష్టం చేసింది.
AP High Court Key Decision On Ysrcp Offices Demolition Notices: ఏపీలో వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వం కూల్చివేత నోటీసులు ఇవ్వడంపై.. వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు (Ap High Court) గురువారం మధ్యాహ్నం విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వైసీపీకి కాస్త ఊరట లభించినట్లయింది. కాగా, రాష్ట్రంలోని 16 వైసీపీ కార్యాలయాలను అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు 5 రోజుల క్రితం కూల్చేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని.. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తక్కువ లీజుకే కట్టబెట్టారని అందుకే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలా అనుమతులు లేకుండా మరిన్ని కార్యాలయాలు సైతం నిర్మిస్తున్నారని.. వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
హైకోర్టులో వైసీపీ పిటిషన్
అయితే, ప్రభుత్వ ఉత్తర్వులపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం గురువారం విచారణ సందర్భంగా.. ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అంతవరకూ యథాతథ స్థితి కొనసాగుతోందని.. రాష్ట్రంలో 16 కార్యాలయాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Also Read: CS Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు - కేంద్రం కీలక ఉత్తర్వులు