AP Half Day Schools: ఏపీలో మరో వారం రోజులపాటు ఒంటిపూట బడులు పొడిగింపు, విద్యాశాఖ నిర్ణయం
Half Day Schools In AP: రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
AP Education Half Day Schools In Ap From June 17 To 24:
ఏపీలో ఒంటిపూట బడులను జూన్ 24 వరకు పొడిగించింది ప్రభుత్వం. రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా పాఠశాల బోధనా సమయం ఉదయం 7:30 నుండి 11:30 వరకు ఉంటుందని తెలిపారు.
రాగి జావ: ఉదయం 8:30 నుండి 9:00 వరకు, మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.
ఏపీలోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో మరో వారం రోజులపాటు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
అకడమిక్ క్యాలెండర్ విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని అన్ని పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్న నేపథ్యంలో.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. మొత్తం 88 సెలవులు వచ్చాయి.
ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్‌ను క్రీడలకు ఆప్షనల్‌గా పేర్కొన్నారు. ఇక ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్ చెప్పాలని విద్యాశాఖ సూచించింది.
ఇంగ్లిష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్ల సబ్జెక్టు చదివిన వారందరూ టోఫెల్ బోధనలో సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. శనివారం రెండో శనివారం అయితే శుక్రవారమే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలని క్యాలెడర్‌లో పేర్కొన్నారు.
➥ దసరా సెలవులు అక్టోబరు 14 నుంచి 24 వరకు ఇస్తారు.
➥ నవంబరు 12న దీపావళి
➥ డిసెంబరు 25న క్రిస్మస్
➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు
➥ క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 21 నుంచి 24 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు.
పరీక్షల తేదీలు ఇలా..
➥ ఫార్మాటివ్-1(సీబీఏ) పరీక్షలు 1-9 తరగతులకు ఆగస్టు 1-4, ఫార్మాటివ్-2 అక్టోబరు 3 - 6 వరకు నిర్వహిస్తారు.
➥ సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు నవంబరు 4 - 10 వరకు, ఫార్మాటివ్-3 (సీబీఏ) జనవరి 3 - 6 మధ్య, ఫార్మాటివ్-4 పరీక్షలను ఫిబ్రవరి 23-27 వరకు నిర్వహిస్తారు.
➥ పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29, సమ్మేటివ్-2, సీబీఏ-3 పరీక్షలు ఏప్రిల్ 11-20 వరకు నిర్వహిస్తారు.