Andhra Pradesh : సెక్రటేరియట్ ఉద్యోగుల్లో కోవర్టులు - విచారణ జరుపుతున్న ఏపీ సీఎంవో !
AP CMO : ఏపీ సచివాలయంలో పని చేసే కొంత మంది కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని సీఎంవో నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా జీవోలు జారీ కావడం ఇతర అంశాలపై విచారణ ప్రారంభించారు.
Andhra Pradesh Secretariat Emplyees : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొంత మంది ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా బిజినెస్ రూల్స్ ఉల్లంఘిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల జీవోలు, గెజిట్స్ విడుదల చేయడం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికీ గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు అమలవుతున్నాయి. వాటిని నిలిపి వేయాల్సి ఉన్నా పట్టించుకోవడ లేదు. వీటన్నింటిపై సమగ్ర పరిశీలన జరిపి.. బాధ్యలెవరో గుర్తించాలని ఏపీ సీఎంవో అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం అంతర్గత విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వ నిర్ణయాలపై ఇప్పుడు జీవోలు విడుదల
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీపీఎస్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ అనే విధానాన్ని తీసుకు వస్తామని ప్రకటించింది. దానికి ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు. కానీ మెజారిటీ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు కానీ జీవో, గెజిట్ జారీ కాలేదు. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేస్తున్న రోజే జీవో జారీ అయింది. హడావుడిలో ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ పట్టించుకోలేదని నెల తర్వాత గెజిట్ జారీ చేసేశారు. దీంతో ఒక్క సారిగా కలకలం రేగింది.
వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండే పలువురు ఉద్యోగుల గుర్తింపు
ఉద్యోగ సంఘాలు జీపీఎస్ అక్కర్లేదని ప్రకటనలు ప్రారంభించాయి. అసలు జీపీఎస్ విధానం అమలు చేయడంపై ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలను విడుదల చేయాలంటే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. బిజినెస్ రూల్స్ స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతున్నాయి. కానీ జీపీఎస్ విషయంలో అధికారులు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఉద్దేశపూర్వకంగానే జీవో జారీ చేశారని వెల్లడయింది. ఆర్థిక శాఖలో పని చేసే శాంతి కుమారి, లా డిపార్టుమెంట్‌లో హరిప్రసాద్ రెడ్డి అనే ఉద్యోగులు ఇందులో కీలకంగా వ్యవహరించారని గుర్తించారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి హ స్తం ?
వీరిద్దరూ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డికి సన్నిహితులు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎన్నికల ప్రచారం చేసినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన తన కు అనకూలమైన ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ నిర్ణయాల కానీ.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల జీవోలను జారీ చేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు పేషీ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. అలాంటి జీవోలు ఏమి ఉన్నా సరే.. తమ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది జీపీఎస్ జీవో, గెజిట్ లను ఆపేసింది.
ఇలాంటి కోవర్టు పనులు చేసే ఉద్యోగులను గుర్తించేందుకు సీఎంవో ప్రత్యేకమైన విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంత మందిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.