YS Jagan Siddham Meeting: తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికే చంద్రబాబు పొత్తులు, జిత్తులు - సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan Comments at Medarametla Siddham Meeting: వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో పొల్గొన్న సీఎం జగన్.. బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
![YS Jagan Siddham Meeting: తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికే చంద్రబాబు పొత్తులు, జిత్తులు - సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు AP CM YS Jagan Mohan Reddy satires on TDP BJP and Janasena Alliance for Elections 2024 YS Jagan Siddham Meeting: తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికే చంద్రబాబు పొత్తులు, జిత్తులు - సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/5c42ab21aa72b763560c7c244fbde84f1710070862805233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh News CM YS Jagan: మేదరమెట్ల: ఏపీలో జరగబోతున్న సంగ్రామంలో పేదవాడికి అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ను ఓడించేందుకు కూటమి, జగన్‌ను గెలిపించేందుకు మీరు చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పొల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహం అని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఆయుధాలను తీసి వారిపై ప్రయోగించండి
జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ పేర్కొన్నారు. జనసేనతో పాటు చంద్రబాబు జేబులో మరో రాజకీయ పార్టీ ఉందని.. ఏపీలో ఇటీవల ఏర్పాటైన మూడు పార్టీల పొత్తుపై సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలలో సైన్యాధిపతులు తప్పా, సైన్యమే లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలు, ప్రజల చేతిలో చిత్తుగా ఓడిన పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్‌ను ఓడించేందుకు వస్తున్నాయని చెప్పారు.
అర డజను పార్టీలతో పొత్తులు, జిత్తులతో రాజకీయాలు
‘5 కోట్ల ప్రజల అండదండలతో ఎన్నికలకు మేం సిద్ధమని వైసీపీ చెబుతుంటే.. అక్కడ అర డజను పార్టీలతో పొత్తులు, ఎత్తులు, జిత్తులతో రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాలను తాను ఏలానని, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించినట్లు చంద్రబాబు చెప్పుకునేవారు. కానీ ఏపీలో వైసీపీ చేసిన మంచి, ప్రజా బలం ముందు నేరుగా ఎదుర్కోలేక.. దత్తపుత్రుడుతో కలిసి ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ నేతల ముందు చంద్రబాబు మోకరిల్లారు. జగన్ మేలు చేయకపోతే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు.
వైసీపీ పార్టీ, ప్రభుత్వం విరగకాసిన మామిడి చెట్టులా ఉంటే.. గత పాపాలకు ఫలితం అనుభవిస్తున్న చెట్టులా చంద్రబాబు పార్టీ ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు ప్రజల గడప తొక్కి మనం చేసిన సంక్షేమాన్ని వివరిస్తుంటే.. చంద్రబాబు పొత్తుల కోసం పార్టీ నేతల గడపలు తొక్కుతున్నారు. విలువలు, విశ్వసనీయ, సిద్ధాంత బలం, పేదలకు మంచి చేశామన్న చరిత్ర మన సొంతం’ అని నాలుగో సిద్ధం సభలో ప్రతిపక్ష పార్టీల పొత్తులపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘లంచాలు, వివక్ష లేని పాలనతోనే మా ఫ్యాన్‌కు కరెంట్ వస్తుంది. చంద్రబాబు సైకిల్‌కు ట్యూబుల్లేవ్, టైర్లు లేవు, అసలు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టింది. ఆ సైకిల్ తొక్కడానికి చంద్రబాబుకు వేరే పార్టీలు అవసరం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచిగానీ, ఒక్క పథకం కూడా లేదు. పొత్తుల్లో భాగంగా ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్యాకేజీ స్టార్ తన వాళ్లకు సీట్లు అడగడు. తక్కువ సీట్లు ఎందుకు అని అసలు ప్రశ్నించడు. తాను తానే టీ గ్లాస్ కూడా చంద్రబాబుకు ఇచ్చేస్తాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చునే వ్యక్తి పవన్ కళ్యాణ్. పొత్తుల్లో లేనట్లు డ్రామా చేయమంటే సైతం రక్తి కట్టిస్తారంటూ’ వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)