CM Jagan : వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు అధికారం మనదే - సీఎం జగన్
CM Jagan : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తే మరో 30 ఏళ్లు అధికారం మనదే అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్.
CM Jagan : విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై చర్చించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన చేస్తున్నామన్నారు. వైసీపీ మ్యానిఫెస్టోలో చెప్పినట్టు 98 శాతానికి పైగా హామీలు అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించేలా అడుగులు వేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందన్నారు. స్కూళ్లు, ఆసుపత్రులు మారుతున్నాయన్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసే తీరు కూడా మారుతోందని తెలిపారు.
విశాఖపట్నం జిల్లా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమావేశం. దిశానిర్దేశం చేసిన సీఎం. pic.twitter.com/N0CojRYBTm
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 15, 2022
175 సీట్లు సాధ్యమే
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 76 శాతం ఇళ్లల్లో వైసీపీ ప్రభుత్వ పథకాలు కనిపిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే దాదాపు 80 వేల ఇళ్లల్లో లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. సంక్షేమ పాలన వైపు వేస్తున్న అడుగులు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వంలో పారదర్శకతతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతాయి. వైసీపీ పాలన చూసి ప్రజలు ఆశీర్వదిస్తూ మరో 30 ఏళ్లు ఉండాలని దీవిస్తారన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. నలుగురికి మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. అందరూ కలిసి పనిచేస్తే 175 సీట్లు సాధించడం సాధ్యమేనని సీఎం జగన్ అన్నారు.
30 ఏళ్ల అధికారం
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని సీఎం జగన్ వ్యక్తం చేశారు. పలు నియోజకవర్గాల నేతలతో వరుసగా సమావేశం అవుతున్న సీఎం జగన్.. అక్కడి పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, చేయాల్సిన పనులపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా కార్యకర్తలకు వివరిస్తున్నారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి కాబట్టి అందరూ సన్నద్ధం కావాల్సి ఉందన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నామన్నారు. ఇంత పారదర్శకంగా పథకాలు గతంలో ఏ రోజూ సామాన్యుడి దగ్గరకి పోలేదన్నారు. ఏపీ చరిత్రలో తొలిసారి సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు.
మంచి చేయాలంటే అధికారంలో ఉండాలి
"ఇంట్లో అక్క, చెల్లెమ్మ పేరుతో జరిగిన మంచిని వారికి వివరిస్తూ ప్రజల ఆశీస్సులు తీసుకోండి. అంతే కాకుండా ప్రతి వార్డులో జెన్యూన్ కారణాలతో ఎవరైనా సంక్షేమ పథకాలు పొందలేకపోతే వాటిని కూడా పరిష్కరించాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం దగ్గరుండి పరిష్కరించాలి. అందరూ కలిసి ఒక లక్ష్యంతో పనిచేస్తే విజయం మనదే. ఈ ఒక్క ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకం ఉంది. ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలి. మనం నలుగురికి మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే సాధ్యం. ఇవాళ వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చాం. అవి కొనసాగాలంటే మనందరం కలిసికట్టుగా అడుగులు వేయాలి." - సీఎం జగన్