Andhra News : తమ్మినేని సీతారాంపై నకిలీ డిగ్రీ ఆరోపణలు - డాక్యుమెంట్స్ రిలీజ్ చేసిన టీడీపీ !
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై నకిలీ డిగ్రీ ఆరోపణలు చేశారు టీడీపీ తెలంగాణ నేత నన్నూరి నర్సిరెడ్డి.
Andhra News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం డిగ్రీ చదివినట్లు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి పునరుద్ఘాటించారు. తాము సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాల మేరకు ఆయన బీకాం చదివినట్లు అందజేసిన సర్టిఫికెట్లు బోగస్ అని తేలిందని నర్సిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఈ మేరకు హైదరాబాద్‌లో డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రికార్డుల్లో తన పేరు లేకుండానే సర్టిఫికెట్లు ఎలా వచ్చాయో స్పీకర్ తమ్మినేని చెప్పాలని నర్సిరెడ్డి హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు.
తమ్మినేని సీతారాం చదివినట్లు ప్రకటించుకున్న నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్ రిజిస్టర్‌లో వివరాలు లేవు. ఆయన పేర్కొన్న హాల్‌టిక్కెట్టు కూడా వేరొకరి పేరుతో ఉంది. అలాంటప్పుడు ఆయన వద్ద ఉన్న సర్టిఫికెట్లు ఎవరు తయారు చేశారు? దీనిపై శాఖాపరంగా అధికారులు విచారణ జరపాలన్నారు. నకిలీ బాగోతంపై పోలీసులు దర్యాప్తు చేయాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. నాగకర్నూలు స్టడీ సెంటర్‌లో 2015 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థుల వివరాలివ్వాలని అంబేడ్కర్ యూనివర్శిటీ అధికారులను సమాచార హక్కు చట్టం కింద కోరాం. ఆ ఏడాది ఆ స్టడీ సెంటర్‌లో మొత్తం 839 విద్యార్ధులు చదివారని పేర్కొంటూ ఆ విద్యార్ధులు అందరి వివరాలను అంబేద్కర్ యూనివర్సిటీ మాకు అధికారికంగా ఇచ్చింది. ఆ విద్యార్ధుల జాబితాలో తమ్మినేని సీతారాం పేరు లేదన్నారు.
తమ్మినేని సీతారాం డిగ్రీ పాసైనట్లు ఆయన ఇచ్చిన సర్టిఫికెట్‌లో ఉన్న హాల్ టికెట్ నెంబర్(1791548430)ను డి.భగవంత్ రెడ్డి పేరుతో ఉంది. అలాగే, సమాచారహక్కు చట్టం కింద ఓయూ అధికారులు, తమ్మినేనికి సంబంధించి మాకిచ్చిన సర్టిఫికెట్‌లు నిజమైనవా? కావా? అన్నది పరిశీలించాలని అంబేడ్కర్ యూనివర్శిటీ అధికారులను కోరాం. దానికి... ఆ వివరాలు తమ రికార్డులతో సరిపోవడం లేదని అంబేడ్కర్ యూనివర్శిటీ అధికారులు ధృవీకరించారు. దీన్నిబట్టి చూస్తే తమ్మినేని బీకాం డిగ్రీ సర్టిఫికెట్టు, ప్రొవిజినల్, మైగ్రేషన్, టీసీ అన్నీ కూడా నకిలీవే అని స్పష్టమవుతోందని నర్సిరెడ్డి స్పష్టం చేశారు.
డిగ్రీ చదవకపోయినా చదివినట్లు దొంగ సర్టిఫికెట్‌తో అడ్మిషన్ పొందినందుకు ఆయనపై చర్య తీసుకోవాలని, ఆయన ఈ సర్టిఫికెట్లు ఎలా సంపాదించారో సమగ్ర దర్యాప్తు జరపాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, న్యాయపోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తాము సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రతులను కూడా ఆయన విడుదల చేశారు.