Breaking News Live: తెలంగాణ నుంచి వరి ధాన్యం, బియ్యం కొనలేం - లోక్ సభలో మరోసారి తేల్చిన కేంద్రం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, సమీప ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడనున్నాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై అసని తుఫాన్(Cyclone Asani)గా మారింది. అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ నేడు ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకోనుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా మయన్మార్‌కు చేరుకుని తాండ్వే వద్ద తీరాన్ని దాటుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు సైతం వర్షాలు కురవనున్నాయి. తేమ శాతం ఉండటం వల్ల ఈ రోజు కూడా మధ్యాహ్నం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ తేలికపాటి వర్షం పడనుంది. గాలి గంటకు 30 నుంచి 40 కి.మీ. దాక వీచే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాలు పూర్తిగా అకాల వర్షాలు. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, పెద్ద చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండటం అంత మంచిది కాదని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
అసని తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మేఘాలు కమ్ముకుంటున్నాయి. కర్నూలు జిల్లాలోనూ కొన్ని చోట్ల వర్ష సూచన ఉంది. కొన్ని చోట్ల ఈదురు గాలులు వీచనున్నాయి. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు, అనంతపురం జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉదయం ఉష్ణోగ్రత సాధారణంగా ఉండగా, మధ్యాహ్నం చిరు జల్లులు పడి ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. తేమ, ఉక్కపోత నేడు, రేపు తక్కువగా ఉంటాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
రాష్ట్రంలో 41 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు నేడు సైతం ఉపశమనం కలగనుంది. అసని తుఫాన్ ప్రభావంతో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తే వరి, మామిడి పంటలు, మరికొన్ని పంటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధికంగా మహబూబ్ నగర్, మెదక్‌లలో 39.6 డిగ్రీలుగా నమోదైంది. మొన్నటివరకు గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు చేసిన నల్గొండలో 39.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
KCR Latter To PM: ధాన్యం కొనుగోలుపై ప్రధాని లేఖ రాసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో యాసంగిలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం లేఖ రాశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. కొనకపోతే వరికి మద్దతు ధర ఇచ్చి కూడా ప్రయోజనం లేదన్నారు.
Paddy Procurement: తెలంగాణ నుంచి వరి ధాన్యం, బియ్యం కొనలేం - లోక్ సభలో మరోసారి తేల్చిన కేంద్రం
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ యాసంగి పంటను తెలంగాణ నుంచి కొనబోమని తేల్చి చెప్పింది. ఇప్పటికే FCI వద్ద భారీ నిల్వలు ఉన్నాయని, ఉత్పత్తి, డిమాండ్ ను బట్టి ఈ ఏడాదికి పంట కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ప్రకటన చేశారు.





















