Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు అధికారులు సస్పెండ్… ఆర్ధిక విషయాలు లీక్ అవడమే కారణమా…!
ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురి సస్పెన్షన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ఇతరరా చెల్లింపుల వివరాలు మీడియాకు లీక్ చేశారన్న అనుమానంతో ఈ చర్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విషయాల గుట్టు రట్టు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్థికశాఖలో పనిచేసేవారు మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారనే అనుమానంతో సీఎఫ్‌ఎంఎస్‌లోనూ చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులను ఖజానా శాఖకు తిప్పి పంపింది. అదే విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అయిదుగురిని హఠాత్తుగా తొలగించింది. ఆర్థికశాఖ అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం కారణాలు చెప్పినా సీఎఫ్‌ఎంఎస్‌లో చర్యలకు ఎలాంటి కారణాలూ వెల్లడించలేదు. ఇతరత్రా ప్రభుత్వశాఖల నుంచి వచ్చి పనిచేసిన వారిని తిరిగి మాతృశాఖకు పంపడం మామూలేనని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పుడైనా సాగనంపొచ్చునని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, జీతాల చెల్లింపుల్లో ఆలస్యాలు, ఇతరత్రా చెల్లింపుల అంశాలు వెలుగులోకి వస్తున్నందున ఈ చర్యలన్నీ బుధవారం చేపట్టిందని చెబుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ మధ్య చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుచేసి అదనపు ఎక్సైజ్ సుంకం విధించి ఆ మొత్తాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేసి రూ.21,500 కోట్ల రుణం ప్రభుత్వం తీసుకుంది. అంతే మొత్తానికి ప్రభుత్వ గ్యారంటీలను బ్యాంకులకు సమర్పించింది. భవిష్యత్తు ఆదాయాలను ఎలా తాకట్టు పెడతారనే అంశం ఆర్థిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది కేంద్రం దృష్టికి వెళ్లింది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం నుంచి దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. పైగా ఆ కార్పొరేషన్‌కు రూ.21,500 కోట్ల మేర ఇచ్చిన గ్యారంటీలు శాసనసభకు తెలియజేయలేదన్న అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ గ్యారంటీల వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల నుంచి తెచ్చే రుణం పరిమితిని దాటిపోయిందనే అంశమూ వివాదంగా మారుతోంది. మరోవైపు ప్రతినెలా రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకువస్తే తప్ప రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయాలన్నీ బయటకు వచ్చి చర్చకు దారితీయడంతో ప్రభుత్వం ఆ గుట్టు రట్టు మూలాలపై దృష్టి సారించింది. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ విషయాలపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి ఫిర్యాదు చేయడంతో ఆ లేఖ ఆధారంగానే కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగమూ స్పందించింది.
విజిలెన్సు అధికారులు కిందటి వారంలో రాష్ట్ర సచివాలయంలోని ఆర్థికశాఖ అధికారులు అనేకమందిని కలిసి ప్రశ్నలు సంధించారు. విజిలెన్సు డైరెక్టర్ జనరల్ నుంచి ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా సున్నితమైన, కాన్ఫిడెన్షియల్ బయటకు లీకు చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురు అధికారులపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్థికశాఖలో నగదు, రుణ నిర్వహణ విభాగం సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు, అదే విభాగంలో సెక్షన్ ఆఫీసర్ కసిరెడ్డి వరప్రసాద్, మరో విభాగం సెక్షన్ ఆఫీసరు డి.శ్రీనుబాబులను సస్పెండు చేశారు. వీరు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఈ సమాచారం వీరు బయట పెడుతున్నారనే ప్రాథమిక అనుమానం విజిలెన్స్ వ్యక్తం చేసింది. సున్నితమైన ఆర్థిక అంశాలు, రహస్య అంశాలు లీకు చేస్తుండటంతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా, విషయాలను వక్రీకరించేలా కథనాలు వస్తున్నాయని అందులో పేర్కొంది. వెంకటేశ్వర్లు, వరప్రసాద్‌ల నుంచి సమాచారం శ్రీనుబాబుకు చేరి, ఆయన ద్వారా బయటకు లీకవుతోందని అభియోగాలు మోపారు. ఆ సమాచారం ఎంత సున్నితమైందో, ఎంత రహస్యంగా ఉంచాలో తెలిసినా, అనధికారికంగా బయటకు పంపారని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. గ్యారంటీల సమాచారమూ వరప్రసాద్ వెల్లడించారంటూ ఆ ఉత్తర్వుల్లో అభియోగం మోపారు.
రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులన్నీ సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఖజానాశాఖకు చెందిన ముగ్గురు అధికారులు వి.వి.రావు, అచ్యుతరామయ్య, నాగపట్టాభి తదితరులు తాత్కాలికంగా సీఎఫ్‌ఎంఎస్‌లో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు. హఠాత్తుగా వారిని బుధవారం సొంత శాఖకు పంపుతూ సీఎఫ్‌ఎంఎస్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. వీరు కాకుండా ఇప్పటికే పదవీవిరమణ చేసి సీఎఫ్‌ఎంఎస్‌లో ముఖ్య స్థానాల్లో ఉన్న మరో అయిదుగురి కాంట్రాక్టును హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. వారిలో ఒకరి కాంట్రాక్టు ఆగస్టు 31తో పూర్తవుతుందని, సమీపంలోనే ఆ గడువు ఉన్నా ముందే పంపేయడం చర్చనీయాంశమవుతోంది.