AP Bundh Live Updates: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. గవర్నర్ పేటకు తరలిస్తున్న పోలీసులు
ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చిన వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు 20న జరిగే తాజా వార్తలు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యాలయాలపై మంగళవారం దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై యాభై మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన సామాగ్రినంతటిని ధ్వంసం చేశారు. పట్టపగలు అందరూ చూస్తూండగానే నింపాదిగా దాడులు చేసి వెళ్లిపోయారు. గతంలో ఓ రెండు సార్లు పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. అయినా పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాటు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారని భావిస్తున్నారు.
ఒక్క పట్టాభిరామ్ ఇంటిపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులు జరిగాయి. కొంత మంది సెక్యూరిటీని నెట్టేసి కార్యాలయంలోకి దూసుకెళ్లి దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టినట్లుగా తెలుస్తోంది. కడప సహా పలు చోట్ల టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జగినట్లుగా తెలుస్తోంది. ఎక్కడా పోలీసులు అడ్డుకోవడం కానీ.. భద్రత కల్పించడం కానీ చేయలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మూలం ఇదీ..
గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో వైసీపీ నేతలపై నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేయడంతో నర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అర్థరాత్రి ఇంటికి వెళ్లారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన పట్టాభిరామ్... వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా చేయిస్తున్నారని.. గంజాయి వ్యవహారంపై మాట్లాడకుండా బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఈ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే దాడులకు దిగినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
కొద్ది రోజులుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అన్నీ గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ ఆరోపణల చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయ నేతలు, ఆరోపణల మధ్యలో పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తోంది. సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం పెట్టారు. గంజాయి అక్రమ రవాణా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి స్మగ్లింగ్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అనూహ్యంగా అర్థరాత్రి సమయంలో నర్సీపట్నం పోలీసులు గుంటూరులోని నక్కా ఆనంద్ బాబు ఇంటికి వచ్చారు. నర్సీపట్నం సీఐ కూడా వచ్చారు. అర్థరాత్రి పూట నిద్రలో ఉన్న నక్కా ఆనంద్ బాబును లేపారు. సోమవారం మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో గంజాయి మాఫియా అని ఆరోపణలు చేశారని.. దానికి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేయడానికి వచ్చామని చెప్పారు. నోటీసులు ఇవ్వడానికి అర్థరాత్రి రావాలా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఉదయమే వస్తామని వెళ్లిపోయారు.
ఈ అంశంపై పట్టాభిరామ్ తీవ్రమైన విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మూకుమ్మడిగా ఒకే సారి నిరసనలు.. టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగడంతో ప్రణాళికతోనే చేశారని అనుమానిస్తున్నారు. అందరికీ ఒకే సారి దాడులు చేయాలని సమాచారం పంపారని.. అడ్డుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలిచ్చారని.. పోలీసులు పాటించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు..
టీడీపీ నేత పట్టాభిని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. పట్టాభి ఇంటి హై టెన్షన్ కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్‌పై నిన్న పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆపై టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడులు జరిగాయి. 120 బి సెక్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని పట్టాభి భార్య మీడియాకు తెలిపారు. తన భర్త ఎలా వెళ్లారో అలాగే ఇంటిికి రాకపోతే ఏపీ ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. తలుపులు బద్ధలుకొట్టుకుని వచ్చి మరీ తన భర్తను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేపు, ఎల్లుండి జనాగ్రహ దీక్ష చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
రేపు, ఎల్లుండి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్ష చేయనుంది. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు తెలుపుతున్నాయి. బూతు వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పార్టీ ఆఫీసుకు రాకుండా నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం
మంగళగిరిలో టీడీపీ ఆఫీసు వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ ఆఫీసుకు రాకుండా నారా లోకేష్ సహా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కీలక నిర్ణయం.. 36 గంటల పాటు దీక్ష
ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు రోజుల పాటు దీక్ష చేపట్టనున్నారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. ఇది 36 గంటల పాటు కొనసాగనున్నట్లుగా టీడీపీ వర్గాలు తెలిపాయి.
పట్టాభిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలి.. వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్
సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యల వెనక కచ్చితంగా చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు చేసినట్టే అనుకోవాలని చెప్పారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు తనకేం సంబంధం లేదని నిరూపించుకోవాలంటే పట్టాభి చేత జగన్‌కు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పట్టాభిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం వైఎస్ జగన్ అని, అలాంటి ప్రజారంజక నేతపై పట్టాభి నీఛమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని, కానీ టీడీపీ ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తిస్తోందని అన్నారు. ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ సిగ్గులేకుండా ప్రవర్తిస్తోందని, నీఛ, నికృష్ట చర్యలు మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.