Breaking News Live: భద్రాచలం విధుల నిర్వహణకు వెళ్లిన పోలీసులకు కరోనా పాజిటివ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
కొనసాగుతున్న కోడి పందాలు
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కోడి పందాలు, గుండాట, పేకాట జోరుగా కొనసాగుతున్నాయి. నిన్న వర్షాభావం కారణంగా సాదాసీదాగా నడచిన కోడి పందాలు, ఈ రోజు కాస్త ఎండ రావడంతో ఆశాజనకంగా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని చోట్ల పోలీసులు కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వచ్చే సమయానికి ఆ ఒక్క రోజు ఎంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందో దాని కంటే ఎక్కువ నగదు ఒక్క పూటలో చేతులు మారింది. కోడిపందాల స్థావరాల వద్ద మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. కొందరు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాలో అసలుసిసలైన సంక్రాంతి శోభ కోడిపందాలతో కనిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు విజృంభిస్తున్న ఒమిక్రాన్, అటు కోడి పందాలు, ఇటు పండుగ వేళ.. రాబోయే రోజులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది.
వాతావరణం
ఏపీలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద సగటుమట్టానికి 1.5 కిలో మీటర్లు ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు అదే ప్రాంతంలో తక్కువగా గుర్తించారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాక, మెరుపులు, ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల పెద్ద వర్షాలు, మరికొన్ని చోట్ల వడగండ్లు కూడా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. జనవరి 16న నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ నెల 19వ తేదీ వరకూ వాతావరణం పొడిగానే ఉంటున్నట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అదికారులు అంచనా వేశారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. కానీ, వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలోకు రూ.400 వరకూ తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.400 తగ్గి రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.
భద్రాచలం విధుల నిర్వహణకు వెళ్లిన పోలీసులకు కరోనా పాజిటివ్
జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి కరోనా సోకింది. వీరందరూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలం విధుల నిర్వహణకు వెళ్లారు. వీరితో పాటు పనిచేస్తున్న పోలీసులు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
విద్యా సంస్థల సెలవులు పొడిగించేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ
గుంటూరు.. విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. సెలవుల పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణాలో సెలవులు ఈ నెల 30 వరకు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.




















