Anantapur: ఒక రైలుబోగీ పైకి ఎక్కిన మరో బోగీ, జనం ఉరుకులు పరుగులు - యాక్సిడెంట్ కాదు, ఏం జరిగిందంటే
Gooty Railway Station: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ లో రైల్వే ఉన్నతాధికారులు ఉత్తుత్తి ప్రమాదాన్ని సృష్టించారు.
Anantapur Railway Mockdrill: అనంతపురం జిల్లాలో రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. దూరం నుంచి అది చూసిన సామాన్య జనం కంగారు పడిపోయారు. రైలు ప్రమాదం జరిగిందేమో అనుకొని ఉరుకులు పరుగులు తీశారు. మరోవైపు, NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందక దళం) కూడా క్షణాల్లో ప్రత్యక్షమై.. హుటాహుటిన రంగంలోకి దిగింది. ప్రయాణికులను కాపాడటంతో పాటు క్షతగాత్రులకు ఎలాంటి హాని జరగకుండా NDRF సిబ్బంది బోగీల్లోంచి వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ మొత్తం ఘటన గురించి అక్కడి స్థానికులు ఆరా తీయగా.. అది మాక్ డ్రిల్ అని తెలిసింది.
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ లో రైల్వే ఉన్నతాధికారులు ఉత్తుత్తి ప్రమాదాన్ని సృష్టించారు. నిజంగా రైలు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలన్నది ప్రయోగాత్మకంగా చేసి చూపారు. బోగీలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ఎలా రక్షించాలి? ప్రమాద ఘటన వద్ద ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలో చేసి చూపారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమానికి గుంతకల్ రైల్వే డీఆర్ఎం వెంకట రమణా రెడ్డి, సీనియర్ పీడీఐ సుధీర్ బాబుతో పాటు ఇతర విభాగాల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రైలులో ఉన్నఫలంగా ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయోగాత్మకంగా చేసి చూపారు. మంటలను ఏ విధంగా ఆర్పాలి.. బాధితులకు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి? అనంతరం హాస్పిటల్‌కు ఎలా తరలించాలన్న విషయాలపై వారు విన్యాసాలు ప్రదర్శించారు. ఈ మొత్తం క్రమంలో ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడాలో చేసి చూపారు. రైల్వే కోచ్‌ల్లో, భవనాల్లో కార్మికులు పనిచేసే స్థలాలలో ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన రిస్క్ ఆపరేషన్ల గురించి వివరించారు. ఈ విన్యాసాలు చూసి అందరూ అబ్బుర పోయారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ ఎం మురళీకృష్ణ, సీనియర్ డీఎంఈ పుష్ప రాజ్, శ్రీనివాస్, విజయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.