Vijayasai Reddy: అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఆ పార్టీలు చెప్పగలవా? టీడీపీ, జనసేన నేతలకు విజయసాయిరెడ్డి సూటిప్రశ్న
AP CM Jagan 3 Years of Ruling: తమది మాట తప్పని ప్రభుత్వ అని, 70% సామాజిక న్యాయం చేశామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
AP CM Jagan 3 Years of Ruling: తాడేపల్లి : అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన పార్టీల హస్తం ఉందని.. పాత్రదారులు, సూత్రదారులు అందర్నీ త్వరలోనే అరెస్టు చేస్తామని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టమని అన్ని పార్టీలూ అడిగాయని, జనసేన దీక్షలు చేస్తే, అధికారంలోకి వస్తే మేమే పెడతామని టీడీపీ కూడా చెప్పిందన్నారు. ఇప్పుడు ఆపేరును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెడితే కావాలనే గొడవలు చేశారని.. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఆ పార్టీలు చెప్పగలవా? అని టీడీపీ, జనసేన నేతల్ని సూటిగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
వైఎస్సార్‌సీపీ మూడేళ్ల ప్రభుత్వంలో సామాజిక న్యాయం
తమది మాట తప్పని ప్రభుత్వ అని, ఈ మూడేళ్లలోనే 70% సామాజిక న్యాయం చేశామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ప్రభుత్వం ఇది. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకూ రూ.1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం. రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు చేరువైన ప్రభుత్వం మాది. మహిళా సాధికారత అనేది చేసి చూపాం. 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చామని చెప్పారు.
విప్లవాత్మక మార్పులు తెచ్చాం
విద్యారంగంలో నాడునేడు కిందతో స్కూళ్ల అభివృద్ధి చేశాం అన్నారు. చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదన్నారు. ‘వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మహానాడులో చంద్రబాబు తొడలు కొట్టిస్తున్నాడు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు. ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం?. టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీలా మారింది. నేతలు బూతులు తిడుతుంటే ఆపాల్సింది పోయి ఆనందం పొందిన వ్యక్తి చంద్రబాబు’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
వ్యవస్థలను మేనేజ్ చేసో, అను’కుల మీడియా రాతలతోనో అధికారం రాదు. ప్రజలు పట్టం కట్టాలి. నాలుగు పార్టీల పొత్తుతో కేవలం ఒక శాతం తేడాతో గెలిచావు. 600 హామీలిచ్చి మాయచేశావు. ప్రజలు నిన్ను ఎప్పటికీ నమ్మరు బాబూ. ఇంట్లో కూర్చుకుని కిచిడీ కేబినెట్ ఏర్పాటు చేసుకుని భ్రమల్లో బతకాల్సిందే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 30, 2022
లోకేష్‌ను నమ్మడు కానీ దత్తపుత్రుడ్ని నమ్ముకున్నారు
చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఆయన ఏడ్చినా సింపతీ రాదన్నారు. అంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. తనకుతాను అపరచాణక్యుడు అని చంద్రబాబు భావిస్తున్నారని, జనం చీదరించుకుంటున్నారని తెలుసుకోవటం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులు తప్ప మరెవరూ బాగుపడరు కానీ జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లాగే 2024లోనూ అంతకు మించి పని చేసి వైఎస్ జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.