UTF On CPS : ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల అల్టిమేటం- 48 గంటల్లో సీపీఎస్‌పై ప్రకటన చేయాలని డిమాండ్
సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతోంది యూటీఎఫ్. ఈ మేరకు జగన్‌కు అల్టిమేటం ఇచ్చింది. ఆలోపు నిర్ణయాన్ని చెప్పకుంటే సీఎవోను ముట్టడిస్తామంటూ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ రద్దు కోసం ఎప్పటి నుంచో ఉద్యోగులు ఫైట్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి కూడా సీపీఎస్‌పై హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం పదిరోజుల్లోనే రద్దు చేస్తానంటూ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలకపోయింది. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతుంది.
౩ నెలల క్రితం సమ్మె చేసిన ఉద్యోగులు... పీఆర్సీతోపాటు సీపీఎస్ రద్దు కోసం పట్టుబట్టారు. కానీ పీఅర్సీపై స్పష్టమైన ప్రకటన చేసిన ప్రభుత్వం సీపీఎస్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నెలలు గడిచినా దీనిపై విధానపరమైన అభిప్రాయం చెప్పలేదు. దీంతో ఉద్యోగులు మరోసారి పోరాటానికి సిద్దపడుతున్నట్టు ప్రకటించారు.
సీపీఎస్ రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని యూటీఎఫ్ నాయకులు హెచ్చరిస్తున్నారు. రెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై తాత్సారం తగదని హితవు పలికారు.
24 గంటల్లో ఉపాధ్యాయు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యూటీఎఫ్ నాయకులు. 25వ తేదీన సీపీఎస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలన్నారు. లేకుంటే ద్విచక్రవాహనాలతో సీఎంవోను చుట్టుముడతామని వార్నింగ్ ఇచ్చారు.
తామేదో వేరే డిమాండ్ చేయడం లేదని... జగన్ మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ఇచ్చిన డిమాండ్‌నే అడుగుతున్నామన్నారు. అన్నీ అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సీపీఎస్ అంశంపై ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు.