చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చిన లోకేష్- కీలక సూచనలు చేసిన టీడీపీ చీఫ్!
మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై లోకేష్ కూడా తనకు ఉన్న సమాచారం ఆధారంగా చంద్రబాబుకు నివేదిక అందించినట్లుగా సమాచారం.
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపుపై చంద్రబాబు లోకేష్ వ్యూహాలు రెడీ చేస్తున్నారు. పార్టీ ఆరంభం నుంచి మంగళగిరిలో టీడీపీకి మంచి పట్టు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై సీరియస్‌గా చర్చలు నడుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. మంగళగిరిలో ఉన్న పరిస్థితిపై ఇంచార్జ్‌గా ఉన్న లోకేష్‌తో సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాలు, కమిటీల నియామకం, స్థానిక నేతల పనితీరు వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా చంద్రబాబు రివ్యూ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో మంగళగిరిలో టిడిపి గెలిచిందని...1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు.
పొత్తుల్లో రెండు దశాబ్దాలపాటు మంగళగిరి సీటు వేరు పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు చంద్రబాబు. 2019 ఎన్నికల తరువాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయాలని ఇంఛార్జ్ లోకేష్‌కు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.
లోకేష్ రిపోర్ట్....
మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై లోకేష్ కూడా తనకు ఉన్న సమాచారం ఆధారంగా చంద్రబాబుకు నివేదిక అందించినట్లుగా సమాచారం. ఇటీవల పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న గంజి చిరంజీవి వైసీపీలో చేరటంతోపాటుగా, నియోజకవర్గంలో అత్యంత అధికంగా ఉన్న పద్మశాలీయ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయంగా ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ ఒత్తిళ్లు కారణంగా చాలా మంది పార్టిని వీడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని... కార్యకర్తలకు అండగా నిలబడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా లోకేష్ అదినేత చంద్రబాబుకు వివరించారు.
111 నియోజకవర్గాలపై ముగిసిన సమీక్షలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటో తెలియాలి అంటే ఈ ప్రభుత్వం కుప్పంలో చేస్తున్న అరాచకాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ది రాజకీయాలు మాత్రమే తెలిసిన కుప్పం ప్రజలకు వైసిపి అరాచక రాజకీయం కొత్తగా ఉందని ఆయన అన్నారు. కుప్పంను తొలి నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేశామని....హింసను, విద్వేష రాజకీయాలను ఇక్కడి ప్రజలు అనుమతించరని చంద్రబాబు అన్నారు. పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో రివ్యూలలో భాగంగా కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులతోపాటు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇంచార్జ్ పిఎస్ మునిరత్నం, మనోహర్, త్రిలోక్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు నిర్వహణ, ఓటర్ వెరిఫికేషన్ సహా పార్టీ కార్యక్రమాలపై అధినేత రివ్యూ చేశారు. నేతలు ఎవరూ భేషజాలకు పోవద్దని గ్రామ స్థాయి వరకు అందరినీ కలుపుకుని వెళ్లాలని గట్టిగా సూచించారు.
కుప్పంలో ప్రజలు అభిమానంతో తనను గెలిపిస్తూ వస్తున్నారని... పులివెందుల మాదిరిగా భయ పెట్టి ఓట్లు వేయించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒకే సింబల్ పై అన్ని సార్లూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇదే సందర్భంలో పులివెందులలో... నేతలు, పార్టీలు, గుర్తులు ఆయా ఎన్నికల్లో మారాయని పేర్కొన్నారు. కుప్పంలో నేతలను, కార్యకర్తలను... కేసులు, దాడులు, కుల విద్వేషాలతో నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని...దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. తమకు ఊడిగం చేసే అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్న వైసీపీ నేతల లెక్కలు సరిచేస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నూలు ఇంఛార్జ్ టిజి భరత్, ఇచ్చాపురం ఇంఛార్జ్ బెందాళం అశోక్ ఈ రివ్యూలకు హాజరయ్యారు. కుప్పం, మంగళగిరి సహా 111 నియోజకవర్గాల్లో సమీక్షలు ముగిశాయని పార్టీ నాయకులు ప్రకటించారు.