Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుపై వైసీపీ మహిళా ఎంపీటీసీ ఫైర్ ! ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన !
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. సతైనపల్లి మండలం పెద్దమక్కేన లో మంత్రి అంబటిపై ఎంపీటీసీ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తనకు ప్రాదాన్యత లభించకపోవటం వెనుక అంబటి హస్తం ఉందని మహిళా ఎంపీటీసీ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
జెండా ఆవిష్కరణలో వివాదం..
సతైనపల్లి మండలం పెద్దమక్కేన లో మంత్రి అంబటి రాంబాబు పై ఎంపీటీసీ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నత పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీటీసీ విజయలక్ష్మికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గొడవ మెదలైంది.హెడ్ మాస్టర్ వనజాతో ఎంపీటీసీ వాగ్వివాదానికి దిగారు. ఇదే సమయంలో మంత్రిని ఉద్దేశించి ఎంపీటీసీ విజయలక్ష్మి తీవ్ర పదజాలంతో దూషించారు. పార్టీ కోసం పనిచేయని వాళ్లు నేడు గ్రామంలో పెత్తనం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అంతే కాదు మంత్రి అంబటిని ఏకవచనంతో సంభోదించి మాట్లాడుతూ, చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు పిల్లల ముందే ఎంపీటీసీ విజయలక్ష్మి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థులు షాకయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఈ వ్యవహరం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర పార్టీ కార్యాలయంలోని పెద్దలకు వీడియోలు చేరాయి.
పురుషోత్తం, భాస్కర్ రెడ్డిపై కోపంతోనే....
తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీటీసీ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. కోపంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. మంత్రి అంబటి రాంబాబు కోసం తన భర్త లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని, దీంతో ఇప్పడు తమ కుమార్తె చదువుకు కూడా డబ్బులు లేకుండాపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం అంతలా కష్టపడితే నేడు పురుషోత్తం, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులు ఎంటర్ అయ్యి, మంత్రి అంబటిని డైవర్ట్ చేసి అంతా వారే చక్రం తిప్పుతున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఎమి చేయటం లేదని, స్థానికంగా అంతా వారిద్దరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అభిమానంతో అంతా కష్టపడి పని చేశామని అన్నారు. అంబటి స్థానంలో మరొక నేత నియోజకవర్గంలో పనిచేస్తే ఆయకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అప్పుల పాలై తాము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎంపీటీసీ పదవి ఇచ్చారే కాని, తమకు అధికారం లేకుండా చేస్తున్నారని వివరించారు. మెడలో బంగారు తాడు కూడా లేకుండా తిరగాల్సిన పరిస్థితిలో ఉన్నానని చెప్పారు.
మంత్రి అంబటికి వరుస షాక్ లు...
నియోజకవర్గంలో అంబటికి వరుసగా షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన అనుచరులు లాటరీ టిక్కెట్ ల నిర్విహించడంతో కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటిపై కేసు నయోదయ్యింది. అంతే కాదు గతంలో మహిళల వ్యవహరంలో అంబటి పై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం చెక్కు ఇచ్చినందుకు రెండు లక్షల రూపాయలు లంచం అంబటి అడిగారని బాధితులు ఆరోపించడం నియోజకవర్గంలో కలకలం రేపింది. ఇలా వరుస ఘటనలతో అంబటి రాంబాబు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నారు.
అంబటి పై పార్టీ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారన్న ప్రచారం సైతం జరుగుతోంది. నియోజకవర్గంలో తమను కాదని వేరొకరికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.