Nara Lokesh: అధికారం, అక్రమార్జన పోయిందనే బాధే మీలో ఉంది - జగన్ వార్నింగ్‌పై లోకేశ్ స్పందన
Nara Lokesh on YS Jagan: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ పోలీసు అధికారికి అత్యంత సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
AP Latest News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (జూలై 22) ఉదయం ఏపీ అసెంబ్లీ ఎదుట పోలీసులతో వ్యవహరించిన తీరుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అధికారం కోల్పోయామనే నిరాశ జగన్ లో కనిపిస్తోందని, ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలని లోకేశ్ హితవు పలికారు. వైసీపీ అధినేత వ్యవహార శైలి చూస్తుంటే.. అధికారం పోయిందనే బాధ, అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన, ఫ్రస్టేషన్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
‘‘పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారికి ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు. 50 రోజుల ప్రభుత్వంలో మేం భయంతో ఉండడం కాదు.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారు అని తెలుసుకోండి. మీ మాటల్లో, చేష్టల్లో, కుట్రల్లో అడుగడుగునా అధికారం దూరం అయ్యిందనే మీ బాధ కనిపిస్తోంది. అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం కనిపిస్తోంది.
జగన్ గారూ....ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమి కట్టబెట్టింది ప్రజలు. దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోండి. వాస్తవాలు అంగీకరించండి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ఉంటే మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయం అయ్యింది. ఇప్పుడు 11లో ఒకటి మాయం అవుతుంది. శిశుపాలుడు ఎవరో ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం తుడిచెయ్యలేదంటూ మీరు చేసే విష ప్రచారం ప్రజామోదం పొందదు.
ఇక భయం గురించి అంటారా.. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయం? ఎవరిని చూసి భయం? మీ తీరు చూస్తుంటే....మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అని నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.