మేం ఓట్లేస్తేనే జగన్ గెలిచింది- ఉండవల్లి శ్రీదేవి వర్గీయుల ధిక్కార స్వరం
ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం నిరసన కొనసాగిస్తున్న వేళ వారితో రాజీ కుదుర్చుకునేందుకు డొక్కా వచ్చారనే ప్రచారం జరగుతుంది. అయితే శ్రీదేవి వర్గం మాత్రం డొక్కాకు దీటుగానే సమాధానం చెప్పారట.
తాడికొండ వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. అదనపు సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించినప్పటి నుంచి మొదలైన కకా ఇంకా చల్లారలేదు. ఇంకా తాడికొండలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కనీసం ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా లేని అదనపు సమన్వయ కర్త పోస్టు ఇక్కడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కేవలం తాడికొండ నియోజకవర్గంపై మాత్రమే అదనపు సమన్వయకర్తను నియమించటం వెనుక అంతర్యం ఎంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకత్వం కూడా ఎక్కడా స్పందించడం లేదు. పార్టీ పెద్దలు కూడా శ్రీదేవిని కలసేందుకు విముఖత చూపటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డొక్కా సడన్ ఎంట్రీ....
అదనపు సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆందోళన చేస్తున్న ఉండవల్లి శ్రీదేవి వర్గాన్ని కలసుకున్నారు. వారితో మాట్లాడి ఆందోళన చెందాల్సిన పనిలేదని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. మనం కుర్చొని మాట్లాడుకుందామని వివరించారు. ఊహించని విధంగా వ్యతిరేక వర్గంలోకి డొక్కా ఎంట్రీ ఇవ్వటంతో శ్రీదేవి వర్గం ఆశ్చర్యానికి గురైంది.
డొక్కా సడన్‌గా రావటంతో శ్రీదేవి వర్గం కూడ కాస్త మెత్తబడింది. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, తమ అభిప్రాయాలు తీసుకోకుండా అదనపు సమన్వయకర్తను నియమించటం సరైందికాదని శ్రీదేవి వర్గం వివరించింది. అయితే దీనిపై పార్టీ పెద్దలతో కలసి మాట్లాడుకుందామని డొక్కా వివరించారు. తానేమి పార్టీ పదవి కావాలని అడగలేదని, జగన్ నిర్ణయం అని అన్నారు. అయితే దీనిపై శ్రీదేవి వర్గం కూడా ఘటుగానే స్పందించింది. తాము ఓట్లు వేస్తేనే జగన్ గెలిచారని, మమ్మల్ని అడగకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు. దీంతో డొక్కా నేను కోరుకుంది కాదంటూ...అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది....
ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం నిరసన కొనసాగిస్తున్న వేళ వారితో రాజీ కుదుర్చుకునేందుకు డొక్కా వచ్చారనే ప్రచారం జరగుతుంది. అయితే శ్రీదేవి వర్గం మాత్రం డొక్కాకు దీటుగానే సమాధానం చెప్పారట. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. డొక్కా టీడీపీలో ఉండగా, వైసీపీ నేతలను తీవ్ర ఇరకాటంలోకి నెట్టారు. రాజకీయంగా వైసీపీ నేతలపై కేసులు కూడ పెట్టించారని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ వద్దకే వచ్చి రాజకీయం చేయటం సరికాదని అంటున్నారు. అయితే డొక్కా సడన్‌గా వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసినా, ఆయన ముందే జగన్‌ను సైతం ధిక్కరించే విధంగా శ్రీదేవి వర్గం వ్యాఖ్యలు చేసింది. తాము ఓట్లు వేస్తే గెలిచిన జగన్ ఎందుకు తమను సంప్రదించకుండా మిమ్మల్ని నియమించారని, నేరుగానే ప్రశ్నించారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెడతామని వచ్చిన డొక్కా వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉండటంతో అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఆరా తీస్తున్న పార్టీ నాయకత్వం....
తాడికొండ నియోజవకర్గానికి అదనపు సమన్వయకర్త నియామకంపై ఎమ్మెల్యే వర్గం అసంతృప్తిపై నాయకత్వం ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఇంటికి వెళ్లి ఆందోళన చేయటం, ఆ తరువాత కూడా తమ నిరసన కొనసాగించటం వంటి అంశాలతోపాటుగా పార్టీ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను కూడా పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తోంది.