పోలవరానికి పెరుగుతున్న వరద, నాలుగేళ్ల తర్వాత పట్టిసీమతో పని - మంత్రి అంబటి వెల్లడి
పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టా కు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం నిర్ణయించినట్లు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
పోలవరానికి వరద నీటి తాడికి పెరుగుతోంది. స్పిల్ వేపై ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, ఇంకా పెరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. వరద నీటి ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టా కు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం నిర్ణయించినట్లు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతామని మంత్రి అంబటి అన్నారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిందని, అయితే కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. కేంద్ర జల సంఘం కి నివేదిక ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు.
విపత్తుల నిర్వహణ సంస్ద అలర్ట్..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు వల్ల స్వల్పంగా పెరుగున్న గోదావరి వరద ఉధృతి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నామని అన్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్న విపత్తుల సంస్థ, ముంపు ప్రాంతాల్లో ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరి కు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నారు. ఇక విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహయం కోసం ఇరవై నాలుగు గంటలు అందు బాటులో ఉండేందుకు స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 ప్రకటించారు.
జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టటం వంటి చేయకూడదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వాహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డా.బి.ఆర్ అంబేద్కర్ చెప్పారు.
విశాఖలో మరో భారీ సదస్సు - మంత్రి అంబటి వెల్లడి
విశాఖ పట్నంలో ఇంటర్నేషనల్ కమిషన్ అన్ ఇరిగేషన్, డ్రైనేజ్ సంస్థ ఆధ్వర్యంలో మరో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నవంబర్ ఒకటి నుండి ఎమిదవ తేదీ వరకూ సమావేశం జరుగుతుందని మంత్రి అంబటి తెలిపారు. ఈ సమావేశానికి ప్రధాని, లేదా రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని అంబటి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కలిసి ఈ సమావేశం సంయుక్తం గా నిర్వహిస్తున్నాయిని మంత్రి వివరించారు. మూడేళ్లకు ఒక సారి జరిగే ఈ సంస్థ సమావేశాలు నిర్వహిస్తుందని చెప్పారు. కరోనాకు ముందు కూడా ఆస్ట్రేలియాలో ఈ సమావేశాలు జరిగాయని అన్నారు. ఈ ఏడాది విశాఖలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నీటి నిర్వహణ యాజమాన్యం తదితర అంశాలపై ఎనిమిది రోజుల పాటు సదస్సు ఉంటుందని చెప్పారు.