Kodali Nani: చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా నేను రాజకీయాలు వదిలేస్తా - కొడాలి నాని
శుక్రవారం (ఏప్రిల్ 14) కొడాలి నాని గుడివాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (కొడాలి వెంకటేశ్వరరావు) పరుష పదజాలంతో దూషించారు. గుడివాడలో పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం అయినా కొన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా తాను రాజకీయాలు వదిలేస్తానని తేల్చి చెప్పారు. అసలు అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో మళ్లీ వస్తాయని కొడాలి నాని అన్నారు. శుక్రవారం (ఏప్రిల్ 14) కొడాలి నాని గుడివాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
గుడివాడలో తాము 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారని అన్నారు. ఇప్పుడు గుడివాడ వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయిందని అన్నారు. తాను 2004, 2009లో గుడివాడ నుంచి పోటీ చేసినప్పుడు గెలిచానని, అప్పుడు చంద్రబాబు ప్రచారానికి రాలేదని గుర్తు చేశారు. చంద్ర బాబు జిత్తుల మారి నక్క అంటూ వ్యాఖ్యలు చేశారు.
గుడివాడ సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని, కనీసం ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదని అన్నారు. తాము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారని అన్నారు. ఎన్టీ రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరును కూడా హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు డెవలప్ చేశారని, చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న చిత్తుశుద్ధి చంద్రబాబుకు లేదని విమర్శించారు.
మొన్న నిమ్మకూరులో బస చేసినప్పుడు కూడా బస్సులోనే పడుకున్నారని, ఎవరూ ఇంట్లోకి రానిచ్చి ఆతిథ్యం ఇవ్వలేదని చెప్పారు. పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారి ఇంటికి వెళ్ళి పడుకున్న చంద్రబాబుకు సిగ్గు ఉందా? అంటూ మాట్లాడారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది నేను, జూనియర్ ఎన్టీఆర్. 60 లక్షలు పెట్టి 2003లో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయించాం అని అన్నారు. నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు మాత్రమే అని అన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవని చెప్పారు.
బూతుల ఎమ్మెల్యే రోడ్డుపైకి వస్తాడా? - చంద్రబాబు
చంద్రబాబు గురువారం గుడివాడలో మాట్లాడుతూ.. యుగ పురుషుడు ఎన్టీఆర్ తిరిగిన గుడివాడలో నేడు గంజాయి మొక్క వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకు వస్తే ఈ బూతుల ఎమ్మెల్యే రోడ్డు మీదకు వస్తాడా అని అన్నారు. ఈ ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే అని, గాడి తప్పిన వీళ్లను చరిత్ర హీనులుగా నిలబెడతామని అన్నారు. ఎన్టీఆర్ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారని, క్యాసినోలు తెచ్చారని అన్నారు. భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా అన్నీ అరాచకాలే అన్నారు. అభివృద్ధి పట్టదని, నోరు విప్పితే బూతులే అన్నారు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో ప్రజలే తేల్చాలని కోరారు.