Janasena News: ‘జగనంటే సాఫ్ట్ అనుకుంటివా? హార్డ్! సారు అందులో తగ్గేదేల్యా’ జనసేన పంచ్ మామూలుగా లేదుగా!
ప్రెస్ మీట్‌లో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ అధినేత పర్యటన ఉంటే జనసేన నాయకులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై జనసేన పార్టీ స్పందించింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఎం తీరును ఎండగట్టారు. తాడేపల్లి నుంచి తెనాలికి జగన్ హెలికాప్టర్‌లో వెళ్లడాన్ని నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. అంతేకాక, దీనికి సంబంధించి జనసేన పార్టీ ఓ కార్టూన్‌ను కూడా రూపొందించి ట్వీట్ చేసింది. ‘‘తగ్గేదేల్యా.. ఇరవై అయినా, ఇరవై వేల కిలో మీటర్లు అయినా సారు నేల మీద పోయేదేల్యా.. జగనంటే సాఫ్ట్ అనుకుంటివా? హార్డ్!!’’ అని జనసేన పార్టీ ఓ కార్టూన్‌ను ట్వీట్ చేసింది.
ప్రెస్ మీట్‌లో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ అధినేత పర్యటన ఉంటే జనసేన నాయకులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకంత అభద్రతా భావమని అడిగారు. సీఎం జగన్ తెనాలి పర్యటనకు వస్తుంటే జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. సీఎం జగన్ వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని ఆయన నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా సీఎం జగన్ కు భయం అని, అందుకే ఆయన తెనాలి పర్యటనకు వస్తుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని అన్నారు.
హెలికాప్టర్ లో ప్రయాణం గురించి ఎద్దేవా చేస్తూ.. రోడ్డు మీద వెళ్తే గుంటలు ఉంటాయని హెలికాప్టర్‌లో వెళ్లారని అన్నారు. పాడైపోయిన రోడ్లపై వెళ్లేందుకు సీఎం జగన్ ఇష్టపడకుండా హెలికాప్టర్‌లో వెళ్తున్నారని అన్నారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిలో మీటర్లు మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా? అని ప్రశ్నించారు. అంత తక్కువ దూరానికి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటని, జనం నవ్వుకుంటున్నారని అన్నారు. జనం సొమ్ము మొత్తం సీఎం హెలికాప్టర్ పర్యటనల పాలే అవుతోందని విమర్శించారు. హెలికాప్టర్‌కు పెట్టే డబ్బులతో రోడ్లు బాగవుతాయని, ప్రజల్ని గతుకు రోడ్ల పాలు చేసి సీఎం జగన్ హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సవాల్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో గెలవడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు అన్ని నియోజకవర్గాల్లో గెలిచే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అసలు వారు 175 సీట్లలో పోటీ చేయగలరా అని సవాలు విసిరారు. తాము ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ఉందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్ల నిధులను విడుదల చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 28) తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది అన్నారు. ఆ యుద్ధంలో ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ కానీ.. ఎందుకు ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు అందించలేదని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తూ ఉంటే కుట్రలు చేసేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు తోడుదొంగలుగా వస్తున్నారని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా తనకు సహకారంగా ఉండాలని కోరారు.