Pawan Kalyan On Konaseema Violence: ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసును కవర్ చేసుకునేందుకు ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది : పవన్ కళ్యాణ్ ఆరోపణలు
Pawan Kalyan On Konaseema Violence: అన్ని జిల్లాలకు ఒక విధానం... కోనసీమకు ఒక విధానం తీసుకొచ్చారు. మిగత జిల్లాల మాదిరిగానే అదే రోజున చేసి ఉంటే బాగుండేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తూర్పు గోదావరి జిల్లాను మూడుగా విభజిస్తూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేశారని, తాను గమనించింది ఏంటంటే.. అన్ని జిల్లాలకు ఒక విధానం... కోనసీమకు ఒక విధానం తీసుకొచ్చారని జనసేన అధ్యక్షు పవన్ కళ్యాణ్ విమర్శించారు. మిగత జిల్లాల మాదిరిగానే అదే రోజున చేసి ఉంటే బాగుండేది.. కావాలని జాప్యం చేయడం వెనుక ఉన్న ఉద్దేశమేంటో అర్థం కావడం లేదు. జిల్లాకు మహానాయకుల పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా అభినందించదగ్గ విషయం అన్నారు. అయితే మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కవర్ చేసుకునేందుకు కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించించారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నేతల పేర్లతో వారిని జిల్లాకే పరిమితం చేశారు
మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కడపకు వైఎస్‌ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పోరాటం చేసిన పొట్టి శ్రీరాములను ఓ జిల్లాకు పరిమితం చేశారు. దీని వల్ల ఓ విధంగా మర్యాద పెంచినట్టు ఉందన్నారు. మరోవైపు విలువ తగ్గించినట్టు కూడా ఉంది. మహానాయకుడిని జిల్లాకు పరిమితం చేయడమేంటి? జిల్లాలకు పేర్లు పెట్టడం... అనంతపురం జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంతో చాలా మంది వ్యతిరేకించారని గుర్తుచేశారు. దీనిపై చాలా మంది తన వద్దకు రాగా, వ్యతిరేకించమని చెప్పానన్నారు. ఇది ఏపీ ప్రభుత్వ నిర్ణయమని తాను ఏం చేయలేనని చెప్పేశానని పేర్కొన్నారు. ప్రతి నిర్ణయానికి వ్యతిరేకత ఉంటుంది. దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. జిల్లా విభజన, పేర్లపై చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
అంబేద్కర్ పేరు అప్పుడే ఎందుకు పెట్టలేదు
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు... మిగతా జిల్లాలతో పెట్టి ఉంటే చాలా సహజంగా ఉండేది. ఆరోజు పెట్టంది... ఇవాళ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వమే చెప్పాలి. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని సూచించారు. అంటే గొడవలు పెట్టమని చెప్పారా? మిగతా జిల్లాకు అలాంటి వెసులుబాటు కల్పించలేదెందుకు. అంటే గొడవలు పెట్టాలనే వైసీపీ ప్రభుత్వ విధానంగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.
ఓ సోషల్ మీడియా పోస్టు పెడితే నానా హంగామా చేస్తున్న ప్రభుత్వం... 30 రోజులు టైం ఇచ్చారు అంటే.. గొడవలను ప్రోత్సహించినట్టు అర్థం చేసుకోవచ్చు అన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేస్తుంటే యంత్రాంగాలన్నీ ప్రేక్షక పాత్ర వహించాయని ఆరోపించారు. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే తాను వెళ్తున్నాను అంటే... 144 సెక్షన్ విధించి అలెర్ట్‌గా ఉన్నారని, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. ఇదంతా ప్రీప్లాన్డ్ గా జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు. మంత్రి ఇంటివైపు వెళ్తుంటే ఎందుకు ఏం చేయకుండా ఉండిపోయారని విమర్శించారు.
విధ్వంసాలు చేయడం వైసీపీకి తెలుసు..
గతంలో కూడా ఇలాంటి విధ్వంసాలు చేయడం వైసీపీకి తెలిసిన అంశమేనని, కోనసీమ జిల్లాలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. ఒక్క సంఘటనే అంటే సరిపెట్టుకోవచ్చు. మూడు రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వాళ్ల డ్రైవర్ శవాన్ని తీసుకొచ్చి ఫ్యామిలీకి అప్పగించి... ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వీటన్నింటిని కవర్ చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కలకలం రేపిందని స్పష్టమవుతోందని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.