AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, పిడుగులు! ఈ జిల్లాల్లో ప్రమాదం, ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
Andhra Pradesh Weather:ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు వర్షాలు కుమ్మేయనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రతోపాటు కొన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచి కొట్టబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ముసురు పట్టింది. కరవుదీర వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉష్ణ మండల తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి ఏర్పడాల్సిన అల్పపీడనం కొంత ఆలస్యమైంది. అదే టైంలో పశ్చిమ మధ్య భాగంలో దానికి సమీపంగా ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని. దీని కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు సూచనలు ఉన్నాయి. వీటన్నింటి ప్రభావంతో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల వల్ల మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. పిడుగు పడతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తున్నామని వాటిని చూసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు,కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. pic.twitter.com/owizLUtDwP
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 23, 2025
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా జోరువానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు మాత్రమే కురిసే అవకాశం ఉందని అంటున్నారు. వానలతోపాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైందని లెక్కలు చెబుతున్నాయి.





















