(Source: ECI/ABP News/ABP Majha)
Guntur News: పేషెంట్‌కు రామ్ మందిర్ వీడియో చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ - ఆపరేషన్ మధ్యలో జై శ్రీరాం అని నినాదాలు!
Guntur News: ఈనెల 11న అరండల్ పేటలోని ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తికి మెదడు ఆపరేషన్ జరిగింది. ఈసారి అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఫుల్ వీడియో చూపిస్తూ రోగికి ఆపరేషన్ చేశారు.
Brain Surgery in Guntur: గుంటూరు వైద్యులు మరోసారి రోగికి వీడియో చూపిస్తూ.. అతను స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేశారు. గుంటూరు అరండల్ పేటలోని సాయి మణికంఠ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఇలా వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లు చేయడంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి పేరొందారు. ఈనెల 11న అరండల్ పేటలోని ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తికి మెదడు ఆపరేషన్ జరిగింది. ఈసారి అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఫుల్ వీడియో చూపిస్తూ రోగికి ఆపరేషన్ చేశారు. మణికంఠకు దైవభక్తి ఎక్కువగా ఉందని తెలుసుకున్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ విధంగా ప్రయత్నించామని అన్నారు. ఆపరేషన్ మధ్యలోనే ఆ వీడియో చూస్తున్న రోగి మణికంఠ ‘జై శ్రీరాం’ అన్నారని డాక్టర్లు చెప్పారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన వ్యక్తి మణికంఠ. ఇతను ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మణికంఠకు కొన్నాళ్లుగా ఫిట్స్ సమస్య ఉంది. అయితే, ఆపరేషన్ ద్వారా ఆ సమస్యను నయం చేయవచ్చని వైద్యులు చెప్పారు. కానీ, మత్తు ఇచ్చి మెదడుకు ఆపరేషన్ చేస్తే కాలు చేయి పడిపోయే అవకాశం ఉన్నందున డాక్టర్లు అతణ్ని నిద్ర లేదా మత్తులోకి జారుకోనివ్వకుండా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
గతంలో న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి బిగ్ బాస్, బాహుబలి చూపిస్తూ కూడా ఆపరేషన్లు చేశారు. సైకలాజికల్ గా పేషెంట్ కు కౌన్సెలింగ్ ఇచ్చి ఆపరేషన్ కు రెడీ అయినట్లు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ.. ఆధ్యాత్మిక పరంగా పేషెంట్ ఆపరేషన్ చేసే సమయంలో తమకు బాగా సహకరించారని చెప్పారు. పేషెంట్ బాగానే ఉన్నారని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.