Sucharita: అలకపై సుచరిత ట్విస్ట్- మా అమ్మాయి వల్లే ఇదంతా జరిగిందంటూ వివరణ
మా అమ్మాయి చేసిన చిన్న ప్రకటనే ఇంత గందరగోళానికి దారితీసిందన్నారు మాజీ హోంమంత్రి సుచరిత. మంత్రిపదవి రాలేదని అలకబూనారన్న వార్తలను ఆమె ఖండించారు. సీఎంతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
సామాన్య వ్యక్తిగా ఉన్న తనకు అవకాశం కల్పించి హోంమంత్రి పదవి కట్టబెట్టిన సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పారు సుచరిత. మంత్రి పదవి రాలేదని కాస్త బాధగా ఉన్నప్పటికీ అసంతృప్తి అయితే మాత్రం లేదన్నారు. తన కుమార్తె చేసిన ఓ ప్రకటనతో మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారామె.
సీఎంతో సమావేశమైన మాజీ హోంమంత్రి సుచరిత... జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంచేందుకు పని చేస్తామన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైసీపీలోనే ఉంటానని... ఒక వేళ తప్పుకుంటే మాత్రం వైసీపీ ఓటర్‌గా ఉంటానన్నారు. అంతే కానీ పార్టీ మారే ప్రశ్నే లేదన్నారు.
మంత్రి పదవులు మారుస్తామని మొదట్లోనే జగన్ చెప్పారని... ఆ మేరకు ఆయన మార్పులు చేశారని అభిప్రాయపడ్డారు సుచరిత. అనారోగ్య కారణాలతో తాను బయటకు రాకపోయేసరికి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారామె.
2006లో రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానన్న సుచరిత... తనకు నమ్మి సీటు ఇచ్చి గెలిపించడమే కాకుండా హోంమంత్రిగా చేసిన ఘనత జగన్‌ది అన్నారు. ప్రస్తుతం అనారోగ్య కారణంగా తాను బయటకు రాలేకపోతున్నానని చెప్పారు. తనకు ఆపరేషన్ కూడా జరిగిందన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముందు కూడా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన తాము ఇప్పుడు ఎందుకు అసంతృప్తితో ఉంటామని ప్రశ్నించారు. సామాన్య వ్యక్తిగా ఎమోషన్ అయ్యానన్నారు.
తనను ఓ చెల్లిగా జగన్ భావిస్తారని ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్లే స్వేచ్ఛ తనకు ఉందన్నారు సుచరిత. తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞత చెబుతూ రాసిన థాంక్స్ గివింగ్ నోట్‌ను తప్పుడుగా అర్థం చేసుకున్నారన్నారు. తానేదో రాజీనామా చేశానని... స్పీకర్ ఫార్మాట్‌లో పంపించానంటూ స్టోరీలు రన్ చేశారన్నారు.
ఎప్పుడూ మీడియా ముందుకు రాని తన కుమార్తె కంగారులో ఏదో చెబితే దాన్ని నమ్మి వార్తలు రాశారని ఆవేదన వయ్క్తం చేశారు సుచరిత. ఆమె ఎప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని... ఎప్పుడూ మీడియాతో మాట్లాడలేదన్నారు ఆ కంగారులోనే ఆమె అలా చెప్పి ఉంటుందన్నారు. అప్పటికైనా తన కుమారుడు థాంక్స్ గివింగ్ నోట్ అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఈ స్టోరీలు ఆపాలని రిక్వస్ట్ చేశారామె.
తాను పదవులకు ఆశపడి జగన్ వెంటన నడవలేదని... మాట కోసం కట్టుబడిన వ్యక్తిగా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో జగన్‌కు అండగా ఉంటున్నామన్నారు సుచరిత. ఎప్పటికీ ఆయన వెంటే ఉంటామన్నారు. మేకతోటి సురచరిత రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటుందన్నారు.