Pawan Kalyan: పరువు నష్టం దావాతో జనసేనానికి మైలేజీ వస్తుందా! ఏపీలో హాట్ టాపిక్!
Defamation Case Against Pawan Kalyan: పరువు నష్టం దావా వేయటం వలన పవన్ కళ్యాణ్ కు మైలేజీ వస్తుందా, రాజకీయంగా అధికార పక్షానికి ఇది ఎంత వరకు మేలు కలిగిస్తుందనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Defamation Case Against Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా... పరువు నష్టం దావా వేయటం వలన జనసేనానికి మైలేజీ వస్తుందా, రాజకీయంగా అధికార పక్షానికి ఇది ఎంత వరకు మేలు కలిగిస్తుందనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
వాలంటీర్లను కేంద్రంగా చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించి, చివరకు పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ వ్యవహరంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ మెదలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన పవన్ కే మరింత మైలేజీ పెరుగుతుందని పార్టీలోని పలువురు సీనియర్ల వాదన. అయితే ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. వాలంటీర్ల సేవలపై చర్చ జరగాలన్నా, మహిళల అంశాన్ని కీలకంగా చేసుకొని అధికార పక్షం మరింతగా దూకుడుగా వెళ్లాలన్నా, ఇలాంటి పరిస్దితులు అవసరం అని చెబుతున్నారు. వాలంటీర్లు చేసే సేవా కార్యక్రమాలు వలన రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది, ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ పలకరించి, కుశల ప్రశ్నలు వేసి, ప్రభుత్వానికి వారధిగా నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ల పట్ల ప్రజల్లో సానుభూతి నెలకొంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కామెంట్స్ చేయటం సంచలనం రేకెత్తించింది. అంతే కాదు కేంద్ర నిఘా వర్గాల నుండి తనకు సమాచారం ఉందని పవన్ చెప్పటంతో మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.
పవన్ పై పరువు నష్టం కేసు..
జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వాలంటీర్లు ఈ వ్యవహరంపై రెండు రోజులు పాటు వరుసగా నిరసనలు తెలిపారు. ఇంకా అనేక చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహరం పైనే ప్రభుత్వం లోతుగా అదికారిక వర్గాలతో చర్చించినట్లు సమాచారం. న్యాయ పరంగా ఉన్న అంశాలను లోతుగా పరిశీలించిన తరువాత, హైకోర్ట్ మెట్లు ఎక్కి పరువు నష్టం కేసు వేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 16ను రిలీజ్ చేసింది.
పవన్ కే మైలేజా...
వాలంటీర్ల పై పవన్ చేసినవి కేవలం రాజకీయ పరమయిన విమర్శలేనని, అయితే మహిళల అక్రమ రవాణా అంటూ చేసిన ఆరోపణల్ని మాత్రం సహించే ప్రసక్తి లేదని అంటున్నారు. మహిళల అక్రమ రవాణా అంటే ఆషా మాషీ వ్యవహరం కాదు. అలాంటిది రాజకీయ విమర్శల్లో భాగంగా పవన్ ఎలా నోరు పారేసుకుంటారంటూ ప్రభుత్వంతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ పై పరువు నష్టం కేసు దాఖలు చేయటంతో ప్రభుత్వానికన్నా పవన్ కే రాజకీయంగా మరింత మేలు కలుగుతుందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే ఉంది. పరువు నష్టం కేసుపై పవన్ వ్యహహారాన్ని ప్రజల్లో మరింత చర్చకు దారితీస్తుందని చెబుతున్నారు.
మరోవైపున పరువునష్టం కేసు జీవో విడుదల వ్యవహరం సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి సలహా ఇచ్చిన వాడిని పట్టుకొని బాదాలంటూ ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టికి మనమే అస్త్రం ఇచ్చినట్లు అయ్యిందని, ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు.
మహిళ కోణంలో చూడాలి...
వాలంటీర్లు సేకరించే డేటా, వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి వారిని ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని పవన్ ప్రధాన ఆరోపణ. డేటా అంశం అటుంచితే, మహిళల ట్రాఫికింగ్ అనేది చాలా సీరియస్ వ్యహరం, అంతటి సీరియస్ కామెంట్స్ ను ఎందుకు లైట్ తీసుకోవాలన్న వాదన పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అంతే కాదు పరువు నష్టం కేసు వేయటంతో ప్రభుత్వం ఇలాంటి వ్యవహరాల, అసత్య ఆరోపణలపై ధీటుగా బదులిస్తుందనే సంకేతాలను కూడా పంపినట్లు ఉంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది.