Chandrababu Swearing: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అదిరిపోయే ఏర్పాట్లు, 10 వేల మంది పోలీసులతో భద్రత
Chandrababu Swearing Arrangement: చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrababu Swearing Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (AP New CM) టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ (Kesarapalli IT Park) వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) నేతృత్వంలోని వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం (Gannavaram Airport) ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో సభా ప్రాంగణం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతాల నుంచి వేదిక వద్దకు చేరుకోడానికి ప్రత్యేకంగా రహదారులను సిద్ధం చేస్తున్నారు.
14 ఎకరాల్లో సభా ప్రాంగణం
చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని 14 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరానికి చెందిన రైతులు కంకణాల రమేష్, పొట్లూరి బసవరావు, ద్రోణవల్లి ప్రదీప్, పొన్నం శ్రీరాం, కాజా నెహ్రూలకు చెందిన 14 ఎకరాల స్థలంలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ, మరో మూడు గ్యాలరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ వాహనాల పార్కింగ్‌కు కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక స్థలం కేటాయించారు. సావరగూడెం రోడ్డులోని ఎస్‌ఎల్‌వీ, వీఎన్‌పురం కాలనీ మార్గంలోని ఎలైట్ విస్టా లే ఔట్, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ఆవరణ, ఆర్టీవో కార్యాలయ ప్రాంగణం, మేధా టవర్స్‌లో మొత్తం ఐదు చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
వర్షాలకు తట్టుకునేలా షెడ్లు
ప్రమాణ స్వీకార సమయంలో వర్షం కురిసినా ఎలాంటి ఆటంకం లేకుండా వేదిక, సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సభా ప్రాంగణం వెలుపల పలు చోట్ల భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టారు.
అధికారుల పర్యవేక్షణ
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఐఏఎస్‌లు హరిజవహర్‌లాల్, బాబు వీరపాండ్యన్, కన్నబాబు, హరికిరణ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రముఖుల భద్రత, వేదిక, బారికేడింగ్, బ్లాక్‌ల విభజన, పారిశుద్ధ్యం ఏర్పాట్లు, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
నియోజకవర్గాల వారీగా పాస్‌ల పంపిణీ
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనే వారికి నియోజకవర్గాల వారీగా వీవీఐపీ, వీఐపీ పాస్‌లను సిద్ధం చేస్తున్నామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. నరేంద్రమోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందు కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ బుక్ చేసినట్లు చెప్పారు. ఈ నెల 11, 12 తేదీల కోసం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్ చేశారు.
10 వేల మంది పోలీసులతో బందోబస్తు
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 10 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకూ 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. ఎస్పీజీ బృందం విజయవాడలో స్థానిక పోలీసులతో కలసి భద్రతను సమన్వయం చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయం నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ప్రాంగణం వరకు ట్రయల్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీ గుప్తా పలు సూచనలు చేశారు.