(Source: ECI/ABP News/ABP Majha)
Talliki Vandanam : "తల్లికి వందనం" స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్- ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందీ అర్హులే
Nara Lokesh: తల్లికి వందనం స్కీమ్‌కు సంబంధించిన విధవిధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి నారాలోకేష్ మండలిలో వెల్లడించారు. సోషల్ మీడియా వస్తున్న ఆరోపణలు, ప్రతిపక్షాలు విమర్శలపై కూడా స్పందించారు.
Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో ఒకటైన తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై శాసనమండలిలో ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక విషయాలు వెల్లడించారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని లోకేష్ ప్రకటించారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడ చదివినా పథకానికి అర్హులేనన్నారు.
" తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. దానికి మేం కట్టుబడి ఉన్నాం. గైడ్‌లైన్స్ రూపొందించడానికి టైం కావాలని అడిగాం. నేను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నాను. మంత్రులందరితో కూడా చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. గతంలో మొదట్లో 15 వేలు అని తర్వాత సంవత్సరం నుంచి 14 వేలు అని అది చివరకు 13 వేలకు వచ్చింది. ఒక వెయ్యిరూపాయలు టీఎంఎఫ్ అన్నారు. ఇంకో వెయ్యిరూపాయలు ఎస్‌ఎంఎఫ్ అని అన్నారు. ఎలిజిబిలిటి క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. గ్రామాల్లో నెలకు ఐదు వేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వాళ్లే అర్హులని చెప్పారు. తర్వాత దాన్ని మార్చారు. భూమి విషయంలో కొన్ని షరతులు పెట్టారు. తర్వాత దాన్ని కూడా మార్చారు. తర్వాత విద్యుత్ వినియోగంలో కూడా మార్పులు చేర్పులు చేశారు. "
"నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఇదే విషయంపై ఫిర్యాదులు చేశారు. మేం అప్పు చేసి స్కార్పియో కొనుక్కొని అద్దెలకు తిప్పుకుంటే రేషన్ కార్డు తీసేశారని. దీని వల్ల ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నామని చాలా మంది చెప్పారు. దీనిపై కూడా మేమే చర్చిస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలు మంత్రి స్వామి వద్ద ఉన్నాయి. ఆర్టీజీ నా దగ్గర ఉంది. మేం ఇద్దరం కూర్చొని డేటాను కూడా ప్యూరిఫైర్ చేయాలి. పకడ్బంధీగా అమలుచేయాలన్న లక్ష్యంతో ఉన్నాం.
ఈ పథకం విషయంలో ఎవరికి ఎలాంటి సందేహలు అవసరం లేదు. ఎంతమంది ఉన్నా ఇవ్వాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేం సాధిస్తాం. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు వర్తిస్తుంది" అని లోకేష్ శాసనమండలిలో వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తగ్గుదల, సిలబస్‌తోపాటు నాడు నేడు అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందన్నారు నారా లోకేష్. 2019 తో పోల్చుకుంటే 2024లో 72 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని తెలిపారు. దీనిపై తాము కూడా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని, గత ప్రభుత్వం వేర్వేరు సిలబస్‌లు అమలు చేశామని చెప్పిందని ఇన్ని చేస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మాట్లాడుకోవాలన్నారు లోకేష్. ఇది ఒకరిద్దురు కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం కాదని అన్ని సంఘలు, అన్ని వర్గాల ప్రజలు, సీనియర్లు, విద్యావేత్తలతో చర్చించి విద్యార్థులకు ఎలాంటి సిలబస్ అవసరం, ఎలాంటి విధానాలతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాలనే ఆలోచన చేస్తున్నామని వివరించారు. నాకు నచ్చిందని ఒకటి పెట్టడం నచ్చలేదని ఇంకొకటి తీసే పరిస్థితి రాకూడదన్నారు. ఇతర్రాష్ట్రాల్లో విద్యారంగంలో తీసుకుంటున్న చర్యలు కూడా గమనిస్తున్నట్టు లోకేష్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నామో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. చర్చించి నిర్ణయం తీసుకొని వచ్చే ఏడాది నుంచే వాటిని అమలు చేద్దామన్నారు.