AP High Court: రాజధాని రైతులకు కౌలు ఎప్పుడు ఇస్తారు - ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
AP High Court: అమరావతి ప్రాంత రైతులకు కౌలు చెల్లింపు వ్యవహారంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రైతుల తరఫున సోమవారం హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు.
AP High Court: అమరావతి ప్రాంత రైతులకు కౌలు చెల్లింపు వ్యవహారంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తమకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రైతుల తరఫున సోమవారం హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు.
రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చిన ప్రభుత్వం.. కౌలు చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏటా మేలో కౌలు చెల్లించేవారని, ఈ ఏడాది ఇప్పటి వరకు చెల్లింపులు జరపలేదన్నారు. కౌలు మినహా, వేరే ఆధారం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. గతంలో పిటిషన్ వేస్తే కేవలం పిటిషనర్ రైతుకే కౌలు ఇచ్చి, మిగతా రైతులకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా మే 1లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందన్నారు. కానీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. కోర్టుకు వెళ్లినవారికే కౌలు వేస్తామన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సొమ్ము విడుదల చేయాలని ప్రభుత్వానికి సీఆర్‌డీఏ కమిషనర్ లేఖ రాశారని వార్షిక కౌలు కోసం సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసిన బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైతులకు కౌలు సొమ్ము చెల్లించేందుకు బడ్జెట్ కేటాయించారని బటన్ నొక్కితే చాలు కౌలు సొమ్ము రైతులకు చేరుతుందన్నారు.
అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, సొమ్ము చెల్లింపులో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని రైతుల తరఫు న్యాయవాది ఆరోపించారు. సొమ్ము చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం సీఆర్‌డీఏ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులను కౌలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించింది. తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో.. వచ్చే మంగళవారంలోపు ప్రభుత్వం సమాధానాలతో రావాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
జీఓ వచ్చింది.. డబ్బులే రాలేదు
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు నిర్ణయిస్తూ 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, ఏటా రూ.3 వేలు పెంపు, జరీబు భూములకైతే రూ.50 వేలు వంతున ఏటా రూ.5 వేలు చొప్పున పెంచుతూ వార్షిక కౌలు చెల్లించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.240 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మే 5న జీవో జారీ చేసింది. భూముల పత్రాలు సక్రమంగా ఉన్న వారి వివరాలు పరిశీలించి సీఆర్డీఏ అధికారులు 22,948 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.183.17 కోట్ల కౌలు బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్ చేశారు.
దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. దీంతో మంగళగిరి మండలం పోతిన శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జులై నెల 10న కోర్టులో ఈ వ్యాజ్యం విచారణకు రానుండడంతో ప్రభుత్వం హడావుడిగా అంత వరకే విడుదల చేసింది. ఏడో విడతలో ఈ రైతు కౌలుకు సంబంధించిన బిల్లుకే మోక్షం కలిగింది. ఫలితంగా అందులో ఉన్న 2,139 మంది రైతుల సంబంధించి రూ.16.63 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి ఇంకా మంజూరు చేయలేదు. వాటి కోసం అమరావతి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకు ఇతర ఆదాయ వనరులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చే కౌలే దిక్కని రైతులు చెబుతున్నారు.