Amaravati Padayatra : అమరావతి రైతులకు రిలీఫ్ - పాదయాత్రకు హైకోర్టు అనుమతి !
అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజకీయ నేతలు యాత్రలకు భద్రత కల్పిస్తుండగా .. రైతులకు ఎందుకు కల్పించలేరని ప్రశ్నించింది.
Amaravati Padayatra : అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెంటనే మరోసారి పోలీసులకు పాదయాత్ర అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్ర ముగింపు రోజున బహిరంగ సభకు ఇప్పుడే ధరఖాస్తు చేసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ధరఖాస్తును పరిశీలించాలని కూడా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో పాల్గొనే వారికి ఐడీ కార్డులు ఇవ్వాలని సూచించింది. అమరావతి రాజధానికి మద్దతుగా ఈ నెల12న రైతులు అరసవిల్లికి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఆరు వందల మంది రైతులు పాదయాత్ర చేస్తే భద్రత కల్పించలేరా ?
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే పాదయాత్ర చేయాలని రైతులు నిర్ణయించారని పరిరక్షణ సమితి తరఫున తెలిపారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు డీజీపీ నిరాకరించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది. రాష్ట్రాల మీదుగా సాగే జోడో యాత్ర.. ఢిల్లీలో నిరసనలకు అనుమతులు ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయిన్ టెయిన్ చేస్తున్నారన్నారు. ముఫ్పై ఐదు వేల మంది రైతుల్లో ఆరు వందల మంది పాదయాత్ర చేస్తామంటే భద్రత కల్పించలేమని చెప్పడమేమిటని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
తిరుపతి పాదయాత్ర సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న డీజీపీ
అయితే గతంలోనూ తిరుపతి పాదయాత్ర సందర్భంగా కూడా ఇలాగే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. అయితే అలా అనుమతి ఇచ్చామని అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారని ఏపీ డీజీపీ అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయపరిచారని... ఆ ఘటనలకు సంబంధించి వివిధ జిల్లాల్లో 71 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయన్నారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు పంపించారు. దీన్నే అమరావతి రైతులు హైకోర్టుకు సమర్పించారు.
అమరావతి నుంచి అరసవిల్లి వరకూ పాదయాత్ర
ఈ పాదయాత్ర ఈనెల 12వ తేదీ నుంచి నవంబర్ 11వరకు నిర్వహించనున్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రైతులు పాదయాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. పన్నెండో తేదీ నుంచి వారు పాదయాత్ర చేస్తారు. దారి పొడుగునా ప్రజల మద్దతు కోరుతారు.