Balineni Srinivasa Reddy On Jagana: మంత్రి పదవి రాలేదని ఫీల్ అయ్యా- రాజీనామాపై బాలినేని క్లారిటీ
సీఎం జగన్‌తో భేటీ అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. తాను కాస్త ఫీల్ అయ్యానంటూనే... రాజీనామాపై క్లారిటీ ఇచ్చేశారు
మంత్రిపదవి రాలేదని అలిగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సీఎంతో భేటీ అనంతరం కాస్త శాంతించారు. తాను రాజీనామా చేయలేదంటూ ప్రకటించారు. అలాంటి వార్తలు ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సీఎం ఎలాంటి బాధ్యత అప్పగిస్తే దానికి వందకు వంద శాతం న్యాయం చేశానని... ఇకపై కూడా న్యాయం చేస్తానన్నారు.
వైఎస్ ఫ్యామిలీతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్న బాలినేని... అది ఎప్పటికీ అలాగనే ఉంటుందన్నారు. ఎల్లకాలం వైఎస్ ఫ్యామిలీ తామంతా విధేయులమని ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డి తనకు అవకాశం లేదు కాబట్టే మంత్రి పదవి ఇవ్వలేకపోయారన్నారు. ఈక్వేషన్స్ బట్టి తనకు ఛాన్స్ రాలేదన్న ఆయన.. పార్టీ గెలుపు కోసం ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన పని చేస్తాన్నారు.
జగన్ పార్టీ పెట్టినప్పుడే మంత్రి పదవి వదిలేసి ఆయన వెంట నడిచానని అలాంటి తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఎవరికైనా పదవి పోతే తాస్క ఫీల్ ఉంటుందని అదే ఫీల్‌తో ఇబ్బంది పడ్డానన్నారు. కానీ ఎలాంటి అసంతృప్తి లేదన్నారాయన. దానికే ఎన్నో ఊహాగానాలతో రకరకాలుగా వార్తలు రాయడం సరికాదని మీడియాకు హితవుపలికారు.
పార్టీలో జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించానా చేసేందుకు తాను సిద్ధమని వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తా అన్నారు బాలినేని. ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదన్న ఆయన వేరేవాళ్లకు ఇచ్చారన్న అసంతృప్తి కూడా తనకు లేదన్నారు.
సురేష్‌తో విభేదాలు ఉన్నట్టు కొందరు రాస్తున్నారని అది కూడా కరెక్ట్ కాదన్నారు బాలినేని శ్రీనివాస రెడ్డి. ఇద్దరం జిల్లా చాలా సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నామన్నారు. మంత్రిగా కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నామని ఎప్పుడూ తమ మధ్య విభేదాలు రాలేదన్నారు. సురేష్‌కు ఇస్తే అలిగాను అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి పదవి రాలేదని రాజీనామా చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాచారాన్ని ఖండించిన బాలినేని... తన అనుచరులు కూడా అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరన్నారు. ఎక్కడైనా అలాంటి వ్యక్తులు రాజీనామాలు చేసి ఉంటే వెనక్కి తీసుకుంటామన్నారు. అందరం కలిసి పని చేసి జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇప్పుడున్న మంత్రివర్గాన్ని సీఎం జగన్ తన ఆలోచనలకు తగ్గట్టుగా ఎంపిక చేసుకున్నారన్నారు బాలినేని. అందరూ సమర్థులేనన్నారాయన. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారని ఇలాంటి కూర్పు ఎప్పుడూ చూడలేదన్నారు. అందరికీ ప్రాధాన్యత ఇచ్చింది జగన్ ఒక్కడేనన్నారు.
రెండు రోజుల పాటు ఆయన అలకను తీర్చేందుకు వైసీపీ కీలక నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నెరపిన బుజ్జగింపులు ఎట్టకేలకు సీఎం జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. సజ్జలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే కరణం బలరాంల సమక్షంలో రెండు గంటల పాటు జరిగిన భేటీ ముగిసింది.